మధ్యతరగతి జీవనపోరాటమే ఆయన కథ

 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
 భౌతికకాయం ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి అప్పగింత
 సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు

విజయవాడ (కల్చరల్‌), మే 18: సమకాలీన కథా రచయితలలో పేరెన్నికగన్న పెద్దిభొట్ల సుబ్బరామయ్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పది రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ నగరంలోని ఆ సుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు శ్వాస అందకపోవడంతో వెంటిలేటర్‌పైనే ఉంచారు. శుక్రవారం మ ధ్యాహ్నం 2.30 గంటలకు కన్ను మూశారు. ఆయన భౌతికకాయాన్ని చుట్టుగుంటలోని విశాలాంధ్ర కార్యాలయానికి తరలించారు. పలువురు రచయితలు, సాహి తీ సంస్థల ప్రతినిథులు ఆయనకు నివాళులర్పించారు. ఐదేళ్ల క్రితమే తన మరణానంతరం భౌతికకాయాన్ని మెడికల్‌ కాలేజీకి పెద్దిభొట్ల రాసివ్వడంతో శుక్రవారం రాత్రి 8 గంటల తరువాత ఎన్‌ఆర్‌ఐ కాలేజీకి అప్పగించారు. ఆయన మరణంతో తెలుగు సాహితీలోకం గొ ప్ప రచయితను కోల్పోయింది. 

1938 డిసెంబర్‌ 15న గుంటూరులో జన్మించిన సుబ్బరామయ్య 79 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఆయనకు భార్య గీతారాణి, దత్తపుత్రిక అరుణమణి ఉన్నారు. పెద్దిభొట్ల కళాశాల విద్యను విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో పూర్తి చేశారు. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ వద్ద చదువుకున్నారు. ఆంధ్ర లయోలా కాలేజీలో అధ్యాపకునిగా 40 సంవత్సరాలు పని చేసి డిసెంబర్‌ 1996లో పదవీ విరమణ చేశారు. 1959లో రచనలను మొదలుపెట్టిన సుబ్బరామయ్య రచనలన్నీ పేద, మధ్య తరగతి కుటంబాల జీవితాలతో ముడిపడి ఉంటాయి. ఈయన 200లకుపైగా కథలు, నవలలు రాశారు. ప్రాఽథమిక విద్య ఏ వ్యక్తి యొక్క అభివృద్ధి మీదనైనా ప్రభావం చూపిస్తుందని ఆయన నమ్మకం. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును 2012లో అందుకున్నారు. ఆయన కథలన్నీ రెండు సంపుటాలు ‘‘పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు’’ గా వచ్చాయి.

మొదటి సంపుటికి ‘కథల సంకలన విభాగం’లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు వరించింది. మృత్యువు తరచుగా కనిపిస్తున్న వేళ... మనిషి మనిషిగా ప్రవర్తించే సహజ సన్నివేశాలు, ప్రవర్తించని సహజ ఘటనలూ నిండి ఉండే ఆయన కథలు పాఠకుడిని వెంటాడుతూంటాయి. అక్షరాల వెంట ఆసాంతం పరిగెట్టేలా సాగే కథారచనా శైలి ఆయన స్వంతం. మధ్య తరగతికి చెందిన పెద్దిభొట్ల అభ్యుదయవాది. జీవితాన్ని తనదైన దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించి, కళాత్మకంగా ప్రతిఫలింపజేసిన అ భ్యుదయ రచయిత. గుంటూరు, విజయవాడ మధ్య తిరిగే ఆయన కథల్లో స్వాతంత్ర్యానంతర భారతదేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. భూస్వామ్య, పెట్టుబడి దారీ విలువల మధ్య చిక్కుకున్న మధ్య తరగతి ఆయన కథల్లో దర్శనమిస్తుంది. మానవ సంబంధాలను నియంత్రించే ఆర్థికాంశం ఆయన రచనలన్నింటిలోనూ స్వస్వరూపంతో కనిపిస్తుంది.

 
తెలుగువారికి గర్వకారణం: సీఎం
ప్రఖ్యాత కథా రచయిత పెద్దిభొట్ల మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. 40 ఏళ్ల పాటు అధ్యాపకుడిగా పని చేస్తూనే సాహితీ రంగంలో తనదైన ముద్రతో శిఖరాగ్రస్ధాయికి ఎదిగారని, తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొంది తెలుగువారికి గర్వ కారణంగా నిలిచారని సిఎం కొనియాడారు. 200లకుపైగా కథలు రాసిన పెద్దిభొట్ల మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటని చంద్రబాబు పేర్కొన్నారు.