మచిలీపట్నం, జనవరి 8 : ప్రముఖ రచయిత, కవి భట్రాజు శ్రీనివాసగాంధీ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. ‘సన్నాయి నొక్కులు’ కాలమిస్టుగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు సుపరిచితులు. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం అల్లూరులో 1948లో శ్రీనివాసగాంధీ జన్మించారు. బొమ్మినంపాడు, మాజేరు, వెల్వడం, తదితర ప్రాంతాల్లో తెలుగు పండిట్‌గా పనిచేశారు. వయోజన విద్యాశాఖ అధికార పత్రిక ‘అక్షరకృష్ణ’కి విలువైన సేవలు అందించారు. సినిమా రంగంలోనూ రాణించిన ఆయన ‘జే గంటలు’ చిత్రానికి పాటలు రాశారు. సినీ సాహిత్యంపై విమర్శనాత్మక గ్రంథాన్ని రాశారు. అలతి అలతి పదాలతో అమ్మ శతకం, మనస్సు శతకం, గోమాత శతకం, స్రవంతి, శ్రావ్యగీతిక, కావ్య కస్తూరి, గేదె నవ్వింది, ఉత్తరం తదితర 50వరకు పుస్తకాలు రాశారు.