రవీంద్రభారతి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): చారిత్రక సాహిత్యంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బీఎన్‌.శాస్త్రి మహోన్నతుడని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రతి నెలా నిర్వహిస్తున్న నవలా స్రవంతిలో భాగంగా ప్రముఖ రచయిత బీఎన్‌.శాస్త్రి రచించిన చారిత్రక నవల ‘వాకాటక మహాదేవి’ పై ప్రత్యేక ప్రసంగం నిర్వహించారు. ఈ సందర్భంగా రామోజు హరగోపాల్‌ ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ సాహిత్యాభివృద్ధికి సాహిత్య అకాడమీ కృషి చేస్తోందన్నారు. నవలా స్రవంతి ద్వారా ఆయా నవలల ప్రాముఖ్యాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎన్‌.శాస్త్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.