ఎ.శ్రీనివాస్‌, వి.త్రివేణి, డి.కె.ప్రభాకర్‌ పేర్లు ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భాషా పండితులకు కేంద్ర ప్రభుత్వం.. మహర్షి బాదరాయణ్‌ వ్యాస్‌ సమ్మాన్‌ అవార్డులను ప్రకటించింది. తెలుగుతో పాటు ఇతర భాషలకు సంబంధించి 2019కి గానూ ఈ అవార్డులకు, ప్రశంసా పత్రాలకు ఎంపికైన వారి జాబితాను గురువారం కేంద్ర మానవ వనరుల శాఖ వెల్లడించింది. తెలుగు భాషకు సంబంధించి ఈ అవార్డులకు హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో తెలుగు విభాగ అధ్యాపకుడు డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌, తెలంగాణ వర్సిటీ తెలుగు విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ వి.త్రివేణి, ప్రముఖ రచయిత డాక్టర్‌ డీకే ప్రభాకర్‌ ఎంపికయ్యారు. ద్రవిడ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్‌ రవ్వా శ్రీహరికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసా పత్రాన్ని ప్రకటించింది. అలాగే, సంస్కృత భాషకు సంబంధించి తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్‌లో సంస్కృత భాషాకేంద్రం ప్రత్యేక అధికారి శ్రీపాద సత్యనారాయణ మూర్తికి కూడా ప్రశంసా పత్రం లభించింది. త్వరలో వీరు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నారు.