చిక్కడపల్లి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ప్రముఖ రచయిత్రి గంటి భానుమతికి కొత్తూరి వెంకటలక్ష్మి, సుబ్బయ్యదీక్షితుల పురస్కారాన్ని బహూకరించారు. మధురగాయని, ఉత్తమ ఉపాధ్యాయిని, ప్రముఖ రచయిత్రి హైమవతీ భీమన్న జన్మోత్సవం సందర్భంగా వారి తల్లిదండ్రులు కొత్తూరి వెంకటలక్ష్మి, సుబ్బయ్యదీక్షితుల పేరిట పురస్కారం ఏర్పాటు చేశారు. కళానిలయం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యాగరాయ గానసభలో ఈ అవార్డును భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని బహూకరించారు. ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప రచయిత్రి హైమవతి తల్లిదండ్రుల పేరిట పురస్కారాన్ని మరో గొప్ప రచయిత్రికి అందించడం విశేషం అన్నారు. రచయిత్రులు తమ రచనల ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలు విలువైనవన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ వెల్దండ నిత్యానందరావు, డాక్టర్‌ ముక్తేవి భారతి, కళా జనార్దనమూర్తి, సురేందర్‌, పుష్పలత, గురజాడ శోభాపేరిందేవి, తమిరిశ జానకి పాల్గొన్నారు.