పెద్దిభొట్ల సుబ్బరామయ్య భౌతికకాయానికి నివాళులర్పించటానికి వచ్చిన పలువురు రచయితలు తమ అభిప్రాయాలను, ఆయనతో ఉన్న అవినాభావ సంబంధాన్ని పంచుకున్నారు. సీనియర్‌ పాత్రికేయుడు సీ రాఘవాచారి మాట్లాడుతూ, ‘‘మధ్య తరగతి జీవితాలను దగ్గరగా చిత్రీకరించిన తెలుగు కథకుల్లో పెద్దిబొట్ల ఒకరు. సులభమైన భాష, సున్నితమైన భావప్రకటన, అనంతమైన అర్ధంతో కూడిన వ్యాక్యనిర్మాణం ఆయన కథల్లోని సాహితీరత్నాలు. తోటి రచయితలను ఆదరించటం, సత్కరించటం ఆయన వ్యక్తిత్వంలో ప్రధానమైన అంశం.’’ అన్నారు. పెద్దిభొట్లతో 50ఏళ్లకుపైగా సాన్నిహిత్యం ఉన్న ప్రముఖ రచయి త భమిడిపాటి జగన్నాఽఽథరావు మాట్లాడుతూ, ‘‘ఆయన సాహిత్యమంతా బ డుగులు, బలహీన వర్గాలు, స్టేషన్‌లో అడుక్కునే పిల్లల జీవితాల చుట్టూ తిరిగింది. ఏ రచయితా పట్టించుకోని, జోలికి వెళ్లనటువంటి వారిని దగ్గరగా చూసి రాసిన కథలు గొప్పగా ఉంటాయి. దళిత బ్రాహ్మణుల మీద కూడా చాలా మంచి కథలు రాశారు. 1965 నుంచి ఆయన నాకు బాగా తెలుసు. రచయితలమంతా కలసి వేసిన నాటకంలో రాదు రాదంటున్నా బలవంతంగా ‘జర్నలిస్ట్‌’ పాత్ర వేయించాను. ఆయన మంచి మాటకారి, స్నేహశీలి. మంచి రచయితను సాహితీలోకం కోల్పోయింది’’ అని అన్నారు. జనసాహితి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బి అరుణ మాట్లాడుతూ, ‘‘మధ్య తరగతి జీవన సంఘర్షణలు ఆయన రచనల్లో ప్రతిబింబిస్తాయి. హిందూ మతం పేరిట ఉన్మాదులు, లౌకిక వాదులను హతమార్చే విధానాలకు నిరసనగా, కేంద్ర పాలకుల అసహన రాజకీయాలను ఖండిస్తూ 2015లో సాహిత్య అకాడమి అవార్డు గ్రహీతలతో కలసి ప్రకటన విడుదల చేయటంలో పెద్దిభొట్ల చాలా చొరవ ప్రదర్శించారు’’ అని అన్నారు.

 
కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి జి.వి.పూర్ణచంద్‌ మాట్లాడుతూ, ‘‘తెలుగు కథకు పెద్ద దిక్కు పెద్దిభొట్ల. 1978లో ఆయన అధ్యక్షుడిగా చైతన్య భారతి అనే సాహితీ సంస్థ పని చేసేది. గుమ్మడి దినకరరావు, ఎం.ఆర్‌.ఎ్‌స.ప్రకాసరావు తదితరులు ఉండేవారు. నండూరి రామమోహనరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సంపాదకత్వంలో ‘మహా సంకల్పం’ కవితా సంపుటిని ఈ సంస్థ ద్వారా ప్రచురించారు. అరసంలో చాలాకాలం పనిచేసిన ఆయనకు కృష్ణాజిల్లా రచయితల సంఘతో అవినాభావ సంబంధముంది’’ అని అన్నారు.