రవీంద్రభారతి(హైదరాబాద్), ఆగస్టు 16: చారిత్రక కళ అయిన బుర్రకథను బతికించుకోవాలని  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. గురువారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుర్రకథ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణాచారి మాట్లాడుతూ బుర్రకథ శిక్షణ శిబిరం నిర్వహించడం అభినందనీయమని దీనిని అందరూ సద్వినియోపరుచుకోవాలని సూచించారు. బుర్రకథ కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
 ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ  కాలానుగుణంగా కళను అభివృద్ధి చేయాలన్నారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ బుర్రకథ కళాకారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండి రాజుల శంకర్‌, కళాకారులు షేక్‌ బాబూజీ, సాలం కృష్ణయ్య, ప్రభాకర్‌  పాల్గొన్నారు.