హైదరాబాద్, చిక్కడపల్లి: సాహిత్యపంటను పండించిన బహుముఖప్రజ్ఞాశాలి సినారె అని సాహితీసవ్యసాచి డా ద్వానా శాస్త్రి అన్నారు. సినారె- వంశీ విజ్ఞానపీఠం(వ్యవస్థాపకులు డా, వంశీరామరాజు), ద్వానా సాహితీ కుటీరం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం త్యాగరాయగానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో దివంగత మహాకవి డా.సి. నారాయణరెడ్డికి స్మృత్యంజలి ఘటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. సినారె వ్యక్తిత్వం- సాహిత్యం అంశంపై ఈ సందర్భంగా ద్వానా  శాస్త్రి ప్రసంగిస్తూ సినారె వ్యక్తిత్వం ఆదర్శవంతం అని, సమదృష్టిగలవారని అన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరి గౌరీశంకర్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి సినారె చేసిన సేవలు అమోఘమైనవని ఆయన పేరిట సినారె పీఠాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, డా. తెన్నేటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు.