సినారె జయంతి వేడుకలో మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు

రవీంద్రభారతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఆధునిక యుగంలో వారానికి, నెలకు ఒక భాష అంతరించిపోతోందని, తెలుగు భాష మృత భాష కాకముందే కాపాడుకునేందుకు పోరాటం చేయాలని మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. భాషను విశ్వవ్యాప్తం చేసిన సినారె సాహిత్యమే శ్వాసగా జీవించారని గుర్తుచేశారు. తెలుగు భాషతోనే ఆయన విశ్వంభరుడిగా నిలిచారని అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో వంశీ ఇంటర్నేషనల్‌-వేగ్నేశ్న ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కారగ్రహీత, పద్మభూషణ్‌ స్వీకర్త డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 88వ జయంతిని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన పేరిట నెలకొల్పిన సినారె-ఆళ్ళ పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి ప్రదానం చేసి, స్వర్ణకంకణంతో సత్కరించి అభినందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ సమాజంలో వ్యక్తి ప్రవర్తనను శాసించేది భాష అని, అలాంటి భాషను బతికించుకోవాల్సిన అవసరముందని అన్నారు. సినారె వంటి సాహితీవేత్తలు తెలుగు భాషను కాపాడుకుంటూ వచ్చారని అన్నారు. సినారె అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్‌ స్వయంగా పాల్గొనడం సంతోషకరమని, నాడు ఇచ్చిన హామీల అమలు గురించి సీఎంతో మాట్లాడుతానని అన్నారు. కాళేశ్వరం గురించి మాత్రమే కాదు సినారె గురించి సీఎంతో చర్చిస్తానని అన్నారు. సిరివెన్నెల పాటలు అద్భుతంగా ఉంటాయని, ఆయన నటించిన ఓ చిత్రం తనకు బాగా నచ్చిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సినారె రాసిన పలు కవితలు చదివారు. జై తెలంగాణ.. జై మహారాష్ట్ర అంటూ విద్యాసాగర్‌రావు ప్రసంగం ముగించారు.

సభాధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి మాట్లాడుతూ తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం సినారె అని కీర్తించారు. సినారె పురస్కారాన్ని సిరివెన్నెలకు ప్రదానం చేయడం సముచితమని అన్నారు. పురస్కారగ్రహీత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ తెలుగు సాగరమంతా సినారె సాహిత్యం సాగిందని అన్నారు. భాషను బతికించుకుంటేనే భావం బతుకుతుందని అన్నారు. సినారె లాంటి మహోన్నతుడి పేరిట నెలకొల్పిన పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

కార్యక్రమంలో ప్రముఖ నటి జమున, కార్డియాలజిస్ట్‌ శ్రీనివా్‌సరెడ్డి ఆళ్ళ, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ సీఈవో బండారు సుబ్బారావు, శారదా ఆకునూరి, వంశీరామరాజు, సినారె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా గోవిందరాజు రామకృష్ణారావు రచించిన ‘సర్వాంగీణ ప్రతిభామూర్తి’, కంచెపల్లి రవిచంద్రన్‌ రచించిన ‘నీ పేరు తలచినా చాలు’ పుస్తకాలను ఆవిష్కరించారు. సభకు ముందు శారదా ఆకునూరి నేతృత్వంలో ప్రణయ రాగ వాహిని శీర్షికన సంగీత విభావరి నిర్వహించి అలరించారు.