చిక్కడపల్లి, జూలై 16(ఆంధ్రజ్యోతి): కవి, విమర్శకుడు, సాహితీవేత్త ఆచార్య జి.చెన్నకేశవరెడ్డికి సినారె సాహితీ పురస్కారాన్ని ప్రదానం ఘనంగా నిర్వహించారు. రసమయి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యాగరాయగానసభలో జరిగిన కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ కొణిజేటి రోశయ్య పురస్కారాన్ని చెన్నకేశవరెడ్డికి ప్రదానం చేసి సత్కరించి అభినందించారు. రోశయ్య మాట్లాడుతూ సినారె లేని వెలితి కనబడుతూనే ఉంటుందన్నారు. ఆయన అంతటి గొప్ప సాహితీవేత్త, కవి అన్నారు. చెన్నకేశవరెడ్డి ఆసక్తి ఉన్న కవి అని, ఆయన సాహిత్యం ఎందరినో ఆకట్టుకుందన్నారు.

హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ చెన్నకేశవరెడ్డి మాటమాటలో చమత్కారం ఉంటుందన్నారు. ఆయన రాసిన గేయకవిత్వ సిద్ధాంతవ్యాసం గొప్ప సిద్ధాంత వ్యాసం అన్నారు. చెన్నకేశవరెడ్డి ప్రాసలను సినారె ఎంతో ఎంజాయ్‌ చేసేవారన్నారు.  ఆధునిక ఛందస్సుమీద ఆధిపత్యం ఉన్న వ్యక్తి చెన్నకేశవరెడ్డి అన్నారు. వేదతుల్య వాక్యాన్ని గేయంలో చూపిన గొప్ప కవి సినారె అన్నారు. సినారె పురస్కారం చెన్నకేశవరెడ్డికి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, సాహితీవేత్తలు డాక్టర్‌ తిరుమల శ్రీనివాసాచార్య, డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌, డాక్టర్‌ ఎంకే రాము, ఎంకేఆర్‌ ఆశాలత, తదితరులు పాల్గొన్నారు.