కుటుంబ సమేతంగా స్నేహితురాలి ఇంటికి..

బొమ్మల కొలువును తిలకించిన సుష్మిత

సంప్రదాయం, సంస్కృతిని కాపాడేందుకు మ్యూజియం ఏర్పాటు

తెనాలి టౌన్‌, జనవరి 13 : పట్టణంలోని చెంచుపేట పద్మావతి కల్యాణ మంటపంలో గాయత్రి సేవాహృదయం ఆశక్త వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో జరుగుతున్న లక్ష బొమ్మల కొలువును శనివారం సాయంత్రం ప్రముఖ సినీ హీరో చిరంజీవి కుమార్తె సుష్మిత, విష్ణు దంపతులు.. టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి సందర్శించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెనాలిలోని తన స్నేహితురాలి ఇంటికి శనివారం ఆమె కుటుంబ సమేతంగా విచ్చేశారు.ఈ సందర్భంగా బొమ్మల కొలువును సందర్శించి ప్రాంగణంలో అన్ని బొమ్మలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. బొమ్మల కొలువుకు విచ్చేసిన సుష్మితకు చిరంజీవి అభిమాని, దుగ్గిరాల మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ చందు సాయిబాబు, కౌన్సిలర్‌ దంతాల ప్రేమ్‌కుమార్‌ కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ, అద్భుతంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును తిలకించేందుకు చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో రావడం, వారితో పాటు చిరంజీవి కుమార్తె సుష్మిత దంపతులు కూడా విచ్చేయడం సంతోషకరమన్నారు.ఇటువంటి సంప్రదాయం, సంస్కృతిని కాపాడేందుకు పట్టణంలో మ్యూజియం ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పెండేల వెంకట్రావు, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, జిల్లా కాపునాడు మహిళా అధ్యక్షురాలు కమ్మెల రజనీకుమారి, కృష్ణవందన, కొత్త సుబ్రహ్మణ్యం, యడ్లపాటి తేజ, యడ్లపాటి హిమ, నసీమ్‌, శాఖమూరి సురేంద్ర, ఖుద్దూస్‌, రాజశ్రీ, శైలజ, బొమ్మల కొలువు నిర్వాహకులు కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.