‘దాశరథి చలనచిత్ర గీతాలు’ పుస్తకావిష్కరణలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌
 

రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): సినిమా సాహిత్యానికి గౌరవాన్ని తీసుకువచ్చిన గొప్ప కవి దాశరథి అని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. శ్రద్ధకు, గౌరవానికి దాశరథి పాటలు నిదర్శమని పేర్కొన్నారు. ఆయన పాటల్లో భావుకత కనిపిస్తుందని అన్నారు.  శనివారం తెలుగు వర్సిటీ సమావేశ మందిరంలో డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి రచించిన దాశరథి చలనచిత్ర గీతాలు- విమర్శనాత్మక పరిశీలన పుస్తకావిష్కరణ సభ జరిగింది.  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కె.శ్రీనివాస్‌ పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను అభినందించారు. 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా గీతాలపై విమర్శనాత్మకంగా పుస్తకం రాయడం అభినందనీయమని అన్నారు. ఉద్వేగాన్నందించే పాటలు రాసిన దాశరథి గీతాలపై పరిశోధనాత్మక పుస్తకం రావడం సంతోషకరమని అన్నారు. సినీ పాటలను పరిశోధించేందుకు నమూనాగా కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని చెప్పారు. వ్యాపారాత్మక సినీ ప్రపంచంలో కొన్ని సార్లు కవులు తమస్థాయి దిగి గేయాలు రాయాల్సి వస్తుందని అన్నారు. గాయకులు, సంగీత దర్శకులు ఇష్టపడిన కవి దాశరథి అని తెలిపారు. దాశరథిపై ఉన్న ఉర్దూ పదాల ప్రభావాన్ని రచయిత జగన్నాథస్వామి ఈ పుస్తకంలో బాగా వివరించారన్నారు. దాశరథి సినీ సాహిత్యం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఈ పుస్తకం ఉపయోగకరమని అన్నారు. పుస్తకాన్ని పరిచయం చేసిన వై.సత్యనారాయణ మాట్లాడుతూ దాశరథి తన గేయాల ద్వారా తన హృదయాన్ని ఆవిష్కరించారని అన్నారు. కండగల చిక్కని కవిత్వం రాసిన ఘనత ఆయనదని కొనియాడారు. రసధ్వనితో కూడిన గీతాలనందించారన్నారు. ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం వంటి గాయకులు దాశరథి గేయం కోసం ఎదురుచూసేవారని తెలిపారు. రచయిత ఆరవల్లి జగన్నాథస్వామి లోతైన అవగాహనతో పరిశోధన చేశారని తెలిపారు. సినీ సాహిత్య విందు ఈ పుస్తకమని పేర్కొన్నారు. దాశరథి రచించిన చాలా పాటల వెనుక ఉన్న నేపథ్యాన్ని ఈ పుస్తకంలో వివరించడం విశేషమని అన్నారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రధాన కార్యదర్శి డా.జె.చెన్నయ్య మాట్లాడుతూ లలిత గీతాలే  దాశరథిని సినిమాకు పరిచయం చేశాయని తెలిపారు. పాలపిట్ట ప్రచురణల కేంద్రం అధినేత గుడిపాటి మాట్లాడుతూ సినీ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలిచిన దాశరథి పాటలు గ్రంథస్థం కావాల్సిన అవసరముందని అన్నారు. జగన్నాథస్వామి రచించిన ఈ పుస్తకం దాశరథి సాహిత్యంపై ఇష్టం మరింత పెంచేలా ఉందని చెప్పారు. దాశరథి పాటల గాఢత, సాంద్రతలను ఈ పుస్తకంలో అక్షరీకరించారన్నారు. చివరిగా స్పందించిన రచయిత డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి మాట్లాడుతూ దాశరథి సుమారు 650 పాటలు రాశారని, అందులో చాలా పాటలు జనాల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ ప్రో త్సాహంతో ఈ పుస్తకం రాయగలిగానని తెలిపారు. గాయపడిన కవి గుండెల్లో రాయలేని కావ్యాలెన్నో అంటూ దాశరథి రాసిన పాటను పాడి వినిపించా రు. ఫజల్‌,  ఆంధ్రజ్యోతి అసిస్టెంట్‌ ఎడిటర్‌ రెంటా ల జయదేవ్‌, సాహితీవేత్తలు పాల్గొన్నారు.