భారతీయ వైద్య శాఖలో 30ఏళ్ల కృషి

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద వైద్య విధానంలో విశేష కృషి చేసిన వైద్యులు, కవి ధేనువకొండ శ్రీరామమూర్తి (70) మరణించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన గురువారం కన్నుమూశారు. ప్రకాశం జిల్లా ధేనువకొండ గ్రామానికి చెందిన శ్రీరామమూర్తి తన ప్రతిభతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. 1947లో శ్రీరామమూర్తి జన్మించారు. ఒంగోలు శర్మ కాలేజీలో పీయూసీ చదివారు. తర్వాత హైదరాబాద్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్‌ పూర్తి చేశారు. భారతీయ వైద్య శాఖలో మూడు దశాబ్దాలపాటు వివిధ హోదాల్లో పనిచేసి, 2002లో పదవీ విరమణ చేశారు. హైదరాబాద్‌లో సిద్ధేశ్వరి రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేదం(శ్రియం)ఏర్పాటు చేసి ఆయుర్వేద వైద్య విధానం విస్తృతికి కృషి చేశారు. రెండు దశాబ్దాలుగా కవిత, కథ, వ్యాసం మొదలైన ప్రక్రియల్లో రచనలు చేశారు.

ఈ ఏడాది భోపాల్‌ ‘కవిభారతి’లో పాల్గొన్నారు. ధేనువకొండ తొలి కవితా సంపుటి ‘ఆశల సముద్రం’, తొలి కథా సంపుటి -ఐలాండ్‌ విల్లా, వారి దీర్ఘ కవిత- అమ్మఒడి బాగా ప్రాచుర్యం పొందాయి. ‘వాల్మీకం’ కవితా సంపుటి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆయుర్వేదానికి సంబంధించి అనేక వ్యాసాలు రాశారు. గతేడాది ఒక కథా సంపుటి విడుదలైంది. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని కవి, బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌, డాక్టర్‌ ఎన్‌.గోపి, ఏకే ప్రభాకర్‌, కేపీ అశోక్‌ కుమార్‌ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలంలో శనివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.