మొదలి నాగభూషణశర్మ అస్తమయం

నాటక రంగానికి పెద్దలోటు: సీఎం నివాళి
తెనాలి అర్బన్‌, జనవరి 16:రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, పరిశోధకుడు మొదలి నాగభూషణశర్మ(84) మంగళవారం కన్నుమూశారు. చాలాకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గుంటూరు జిల్లా తెనాలి నాజరుపేటలోని తన స్వస్థలంలో తుదిశ్వాస విడిచారు. అజోవిభో కందాళం ఫౌండేషన్‌ ప్రతిభామూర్తి జీవిత కాల సాధన పురస్కారాన్ని ఈ నెల ఆరో తేదీన అందుకొన్నారు. తరువాత పది రోజుల్లోపే శర్మ శాశ్వతంగా దూరం కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్‌ చదివిన విద్యార్థి, అక్కడే డీన్‌గా పని చేయడం నాగభూషణశర్మ విద్వత్తుకు నిదర్శనమని ఆయన సహచరులు గుర్తు చేసుకొన్నారు. శర్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులు, సాహితీ అభిమానులు, ప్రముఖుల సమక్షంలో బుధవారం తెనాలిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన మరణం నాటక రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. తెలుగు జానపద కళలు , నాటక రంగంలో ఆయన ప్రశంసనీయమైన కృషి చేశారని ఒక ప్రకటనలో నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
అమెరికాలో అభ్యాసం.. ప్రజా కళలపై అధ్యయనం
ఏడు దశాబ్దాల పాటు రంగస్థల నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, అనువాదకుడిగా, ఆచార్యుడిగా, పరిశోధకుడిగా, బహు గ్రంథకర్తగా నాగభూషణశర్మ విరాజిల్లారు. ఆయన పూర్వీకుల స్వస్థలం బ్రాహ్మణకోడూరు. నరసరావుపేటలో మేనమామ భాగవతుల వెంకటసుబ్బారావు ఇంట 1935 జూలై 24న నాగభూషణశర్మ జన్మించారు. ధూళిపూడిలో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని ఇల్లినాయిస్‌ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ, భాషా శాస్త్రంలో పీహెచ్‌డీ డిప్లమో పొందారు. అమెరికా నాటక రంగంపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వ విద్యాలయంలో ఆచార్యుడిగా 18 ఏళ్లు పని చేశారు. ఆయన 1950ల్లో తన తొలి రచన ‘అన్వేషణ’ను నాటిక రూపంలో రాశారు.
 
1954-74 వరకు చిన్నలు, పెద్దలు, వీలునామా, రాజదండం వంటి ఎన్నో నాటకాలను రచించారు. ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృత భాషల్లో ఆయన పండితుడు. మృచ్ఛ కటికం, ముద్రా రాక్షసం, ప్రతిమ వంటి సంస్కృత నాటకాలను తెలుగులోకి అనువదించారు. డిక్షనరీ ఆఫ్‌ థియేటర్‌ టెర్మ్స్‌ (నాటక రంగ పరిభాషక పదకోశం)ను అనితర సాధ్యంగా రూపొందించారు. 64 జానపద కళల పుట్టు పూర్వోత్తరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ‘‘ఫోక్‌ ఫెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అనే గ్రంథాన్ని ఆంగ్లంలో రచించారు. ప్రభుత్వం 2013లో ఎన్టీఆర్‌ రంగ స్థల పురస్కారం, 2018లో కళారత్న పురస్కారాన్ని ఆయనకు అందించింది.
 
అంతియ ఘడియల్లో ఉన్న శర్మను తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మంగళవారం ఉదయమే పరామర్శించారు. ‘మీ పుస్తకాలన్నింటితో ఓ గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం’ అని ఆయనకు హామీ ఇచ్చారు. అదే రోజు సాయంత్రం మొదలి కన్ను మూశారు. నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, ‘ప్రజ్వలిత’ అధ్యక్షుడు నాగళ్ల వెంకటదుర్గా ప్రసాద్‌, రచయిత డీఎస్‌ దీక్షితులు, వేమూరి విజయభాస్కర్‌, రావినూతల శ్రీరామమూర్తి, ఎంపీ కన్నెశ్వరరావు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.