చిక్కడపల్లి, మార్చి19(ఆంధ్రజ్యోతి): సినీ దర్శక, నిర్మాత డా. నిట్టల గోపాలకృష్ణ రచించిన ‘పురాణాల్లో గోమాత కథలు’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. త్యాగరాయగానసభలో మంగళవారం  పుస్తకాన్ని పౌరాణికబ్రహ్మ డా. కందాడై రామానుజాచార్య ఆవిష్కరించారు. ధర్మప్రచార పరిషత్‌ పూర్వ అధ్యక్షుడు డా. కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, దూరదర్శన్‌పూర్వ సంచాలకుడు డా. ఆర్‌ అనంత పద్మనాభరావు తదితరులు ప్రసంగించారు. అవనికే  ఆవు అమ్మ అని వక్తలు అన్నారు. గోమాత గొప్పతనం గురించి  పుస్తకంలో చక్కగా వివరించారని గోపాలకృష్ణను అభినందించారు. కార్యక్రమంలో సి. రామకృష్ణ, మర్రి కృష్ణారెడ్డి, రఘుశ్రీ, నరసింహాచార్య, జనార్దనరావు పాల్గొన్నారు.

సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో..

పట్టా వెంకటేశ్వర్లు రచించిన ‘కులం’ బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ పుస్తకావిష్కరణ  మంగళవారం రాత్రి సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్‌ తిరుమళి మాట్లాడుతూ సామాజిక న్యాయం పట్ల చైతన్యం అంబేద్కర్‌ ద్వారానే వచ్చిందని, పోరాటాల ద్వారానే కుల నిర్మూలన చేయగలమని ఆ రోజుల్లోనే ఆయన చెప్పారని పేర్కొన్నారు.  ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో భూమి ఉన్నన్ని రోజులూ కులం పోదన్నారు. కార్యక్రమంలో ప్రొ. కేవై రత్నం, సాంబశివరావు  పాల్గొన్నారు.