రవీంద్రభారతి, నవంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): బెక్కంటి శ్రీనివాస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌, అవార్డీ టీచర్స్‌ అసోసియేషన్‌(ఆటా) సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో రెండు రోజుల పాటు జరిగిన ఆటా బాలోత్సవం ఆదివారం ఘనంగా ముగిసింది. బాలలదినోత్సవం సందర్భంగా దేశంలోని ఏడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని అలరించారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఈ వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. జవహర్‌లాల్‌నెహ్రూ, మహాత్మాగాంధీ, భక్తరామదాసు, డా.బి.ఆర్‌.అంబేద్కర్‌, సర్వేపల్లి రాధాకృష్ణ, అబ్దుల్‌కలాం తదితర ప్రాంగణాల్లోని వేదికలపై కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ నృత్య పోటీలను నిర్వహించారు. గెలుపొందిన చిన్నారులకు అవార్డులను ప్రదానం చేశారు. శాస్త్రీయ నృత్యాలు, గీతాలు, వాద్య కచేరి, మిమిక్రీ, పద్యాలు, దేశభక్తి గీతాలు, పేరిణి తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బెక్కంటి శ్రీనివా్‌సరావు, జీఎస్పీ వీరారెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకటరెడ్డి, జగన్నాథచార్యులు, లక్ష్మయ్య, ఉషారాణి, కనకదుర్గ, మాలతి, ఉమాదేవి, అంజయ్య, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.