21-0-2017: తెలంగాణ రాష్ట్రం అవతరించాక అన్ని రంగాలను తీర్చిదిద్దుకుంటూ సంబురాలు జరుపుకుంటున్న సందర్భంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో త్వరలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకోబోతున్నామని కవి, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ 45వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం త్యాగరాయగానసభలో తెలంగాణ సాహితీ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగాగౌరీశంకర్‌ మాట్లాడుతూ సుదీర్ఘకాలం కొనసాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎగిసిపడ్డ సాహిత్యం ప్రపంచ ఉద్యమ సాహిత్యంలో ఒక అధ్యాయంగా నిలుస్తుందన్నారు. ఇప్పటివరకు తెలుగు సాహిత్యంలో వచ్చిన అన్ని ధోరణులతో పోలిస్తే తెలంగాణ సాహిత్యం మహోన్నత శిఖరంగా నిలుస్తుందన్నారు. తెలంగాణలో మాతృభాష తెలుగు అమలు కోసం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలను అన్ని వర్గాలు హర్షిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్యం ప్రాంతీయ అస్తిత్వ ఆకాంక్షలు అంశంపై ప్రసంగించిన డా. వి.శంకర్‌, తెలంగాణ కవిత్వం దేశీయతపై మాట్లాడిన డా.కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణలో సంప్రదాయ పద్యవిద్యపై మాట్లాడిన డా. సిహెచ్‌.హరినాథశర్మను సన్మానించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య సూర్యధనంజయ్‌, వంశీ సంస్థల వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, వంశీ అధ్యక్షులు డా.సుధాదేవి పాల్గొన్నారు.