రవీంద్రభారతి, మే 16 (ఆంధ్రజ్యోతి): కళారాధనే జీవిత పరమావధిగా జీవిస్తూ అనేక మంది శిష్యులను తయారు చేస్తూ సుదీర్ఘ అనుభవం ఉన్న వివిధ నాట్య రీతుల గురువులు బుధవారం రవీంద్రభారతి వేదికపై అపూర్వ రీతిలో నృత్యాభినయం చేసి ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. నృత్యాంజలి సాంస్కృతిక సంస్థ, భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురునృత్యోత్సవం శీర్షికన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నాట్య గురువులు అంజుబాబు(కథక్‌), రాజేశ్వరీసాయినాథ్‌(భరతనాట్యం), వనజా ఉదయ్‌(కూచిపూడి), కుమార్‌ (పేరిణి), రమాదేవి (కూచిపూడి), రోహిణి ప్రసాద్‌(కూచిపూడి, భాగవతుల సేతురాం శిష్యురాలు) అపూర్వ నృత్య ప్రదర్శనలో అద్భుతంగా అభినయించారు. ఈ ప్రదర్శనలో గురువు వనజా ఉదయ్‌ తన శిష్యులతో కలిసి కూచిపూడి నాట్య శైలిలో గణేష స్తుతి, పుష్పాంజలి అంశాలను ప్రదర్శించారు. రోహిణి ప్రసాద్‌ అన్నమయ్య కీర్తన మేలుకో శృంగార రాయ అంశాన్ని ప్రదర్శించారు. రాజేశ్వరి సాయినాథ్‌ శివాంజలి అంశాన్ని, రమాదేవి క్షేత్రయ్య పదాన్ని ప్రదర్శించి రంజింపజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ గురువులను సత్కరించి అభినందించారు. గురువులను ఒక వేదికపై తీసుకువచ్చి ప్రదర్శింపజేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాట్య గురువు కళాకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు.