రవీంద్రభారతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నాటక రంగానికి ఎనలేని సేవలు చేయడంతో పాటు నాటక దినోత్సవం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి డీఎస్‌ దీక్షితులు అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి అన్నారు. సినిమా, టీవీ, రంగస్థల రంగాల్లో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో  భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో యువకళావాహిని, జంట నగరాల కళా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు డీఏ్‌స.దీక్షితులు సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో రమణాచారితో పాటు ప్రముఖ రచయిత సీఏ్‌స.రావు, వడ్డేపల్లి కృష్ణ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌, నటులు జీవీ.నారాయణ, శివపార్వతి, ఉత్తేజ్‌, కోట్ల హనుమంతరావు, సినీ దర్శకుడు ఏన్వీ.రఘు, నర్సింగరావు, కుటుంబ సభ్యులు శ్రీధర్‌, సుజాత పాల్గొని దీక్షితులు  చిత్రపటానికి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ సినీ, నాటక రంగాలకు ఎంతోమంది నటులను అందించిన ఘనత దీక్షితులు మాస్టారుదన్నారు. కళాకారులకు నీడనిచ్చే చెట్టులా బతికారని గుర్తుచేశారు. ఆకలితో ఉన్న కళాకారుడి కడుపు నింపే ప్రయత్నం చేశారన్నారు. దీక్షితులు తనకు తమ్ముడు లాంటి వారని, అన్నా అని ఆప్యాయంగా పిలిచేవారన్నారు. దీక్షితులు మరణం తెలుగు నాటక రంగానికి తీరని లోటు అని రమణాచారి పేర్కొన్నారు. దీక్షితులు భౌతికంగా లేకపోవచ్చు కానీ ఈతరం నటులంతా ఆయన ప్రతిరూపాలన్నారు. దీక్షితులు కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని అన్నారు. ఆర్పీ పట్నాయక్‌ మాట్లాడుతూ సినీ ప్రయాణం దీక్షితులు మాస్టారుతోనే ప్రారంభించానని తెలిపారు. గతంలో రవీంద్రభారతిలో ఆయన నిర్వహించిన శిక్షణా శిబిరాల్లో తాను పాల్గొన్నానని తెలిపారు. మాస్టారు లేని లోటు తీర్చలేనిదన్నారు. శివపార్వతి మాట్లాడుతూ తన లాంటి ఎంతోమందిని నటులుగా తీర్చిదిద్దిన ఘనత దీక్షితులు మాస్టారుదన్నారు.

ఆయన తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఉత్తేజ్‌ మాట్లాడుతూ  మాస్టారు జ్ఞాపకం కాదు ఓ జీవితం అని అభివర్ణించారు. నాటక రంగం గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. దీక్షితులు  కుమారు శ్రీధర్‌ మాట్లాడుతూ తన తండ్రి జీవితమంతా నటన కోసం అర్పించారన్నారు. కార్యక్రమంలో పలువురు సినీ, టీవీ, నాటక రంగానికి చెందిన నటీనటులు  మాస్టారు చిత్రపటానికి నివాళి అర్పించారు