కథ-2016’ ఆవిష్కరణ సభలో వక్తలు

సమాజానికి సాహిత్యాన్ని అందించే ప్రయత్నం : జేపీ

తణుకు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : సాహిత్యాన్ని సమాజానికి శాశ్వతంగా అందిస్తున్న ప్రయత్నమే కథా సంచిక ఆవిష్కరణ కార్యక్రమం అని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని శ్రీ చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో కథా-2016 సంచికను ఆదివారం ఆయన ఆవిష్కరించారు.

కన్యాశుల్కం మళ్లీమళ్లీ చదవాలనిపిస్తుండటానికి కారణం ఆ పరిస్థితులు ఇప్పటి కీ సమాజంలో కనిపిస్తూండటమేనన్నారు. రవి కాంచని కోణాలను కవి కాంచకపోతే సమాజం నష్టపోతుందన్నారు. ప్రస్తుత సమాజంలో ఎన్నో చీకటి కోణాలు, దోపిడీలు ఉన్నాయని, అధికారం కోసం పడే లాలస ఎక్కువయ్యిందన్నారు. భారతదేశమంతా అంతర్జాతీయ సర్వేలలో పాల్గొనబోదని ప్రభుత్వం ప్రకటించిందని, ఇక్కడున్న లోపాలు ప్రపంచానికి తెలియకుండా చేయడమే ప్రభుత్వం లక్ష్యం కావచ్చని చెప్పారు.

కథా సాహితి సంపాదకుడు వాసిరెడ్డి నవీన్‌ మాట్లాడుతూ 27 ఏళ్లుగా కథా సంకలనాలుగా వేస్తున్నామని, పిల్లల కథలు కూడా రెండేళ్ల నుంచి కథా సంకలనంలో వేస్తున్నామన్నారు. ప్రముఖ కవి శివారెడ్డి మాట్లాడుతూ కథ సమాజానికి అద్దం పడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎం.శ్రీనివాస ప్రసాద్‌, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రముఖ కవి బీవీవీ ప్రసాద్‌, ప్రముఖ రచయిత కెఎన్‌ మల్లేశ్వరి, ప్రముఖ కథా రచయిత పి.సత్యవతి, పాలపిట్ట సంపాదకుడు కె.అశోక్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.