తెలంగాణ ‘తెలుగు’ బిడ్డలను స్మరించుకుందాం..

ప్రపంచంలో తెలుగువారందరినీ ఆహ్వానించండి: సీఎం

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):తెలంగాణలో తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. మహాసభల్లో తెలుగు భాషా ప్రక్రియల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్‌లో అధికారులతో బుధవారం సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్యసాహిత్యం, గద్య సాహిత్యం, అవధానం, జానపదం, సంకీర్తనా సాహిత్యం, కథాకథన రూపాల్లో ఎంతో మంది తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషి చేశారని అన్నారు. వారందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, తెలుగు భాష కోసం వారు చేసిన కృషిని నేటి తరానికి చాటిచెప్పాలని అన్నారు.

వందల ఏళ్ల నుంచి తెలంగాణలో పండితులు, కవులు, రచయితలే కాకుండా నిరక్షరాస్యులు కూడా బతుకమ్మ లాంటి పాటల ద్వారా జానపద పరంపరను కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. ప్రతీరోజూ సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొంటారని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అమెరికా సహా తెలుగు వారు ఎక్కువున్న దేశాల్లో, ఏపీసహా తెలుగువారున్న రాష్ర్టాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆహ్వానించాలని సీఎం సూచించారు.

సాహి త్య అకాడమీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎండబ్ల్యూఎ్‌సఎ్‌సబీ సమన్వయంతో పనిచేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులను ఆన్‌డ్యూటీ మీద సభలకు ఆహ్వానించి, బాధ్యతలు అప్పగించాలన్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగరావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌. తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం, మునిసిపల్‌ శాఖ మఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.