నెల్లూరు, ఆగస్టు 12: తెలుగు కవిత్వంలో భావ కవిత్వం శిఖరాగ్రాన ఉన్న సమయంలో ఒక ఝంజా మారుతంలా ప్రవేశించిన ప్రయోగవాది పఠాభి అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ కాళిదాసు పురుషోత్తం అన్నారు. విజయవాడ బుక్‌ఫెస్టివల్‌ సంస్థ, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌, ఏపీ సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తకాల సంబరాల్లో భాగంగా ఆదివారం పఠాభి సాహిత్యంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన  ఆయన మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం, చేరదలచిన లక్ష్యం కోసం అడ్డంకులను, అవరోధాలను లక్ష్యపెట్టని కవితా సాహసి పఠాభి  అని కొనియాడారు. కవిత్వం అంతా ఛాందస భావాలతో భావకవిత్వంతో కొట్టుకు పోతున్న సమయంలో నూతనత్వం కోసం అన్వేషించిన తొలికవి పఠాభి అని పేర్కొన్నారు. అందుకే తెలుగు సాహిత్యంలో ఆయన ప్రయోగవాదిగా నిలిచారన్నారు. జీవితంతో ఎన్ని ఒడిదుడుకులను, ఆటు పోటులను ఎదుర్కొన్నా, భయపడక ముందుకు నడిచిన వాస్తవవాది అని వివరించారు. 

సభకు అధ్యక్షత వహించిన సాహితీవేత్త హెచఎస్‌ఎల్‌వీ రంగారావు మాట్లాడుతూ జీవితంలో సాహిత్యాన్ని అత్యధికంగా ప్రేమించిన వ్యక్తి పఠాభి  అని, జీవితం కోసం కవిత్వం కోసం ఎన్నో ఎదుర్కొని ముందుకు నడిచిన ఆధునిక భావాలు కలిగిన కవి పఠాభి నెల్లూరు వారు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. సాహితీ సమన్వయ కర్తగా వ్యవహరించిన ఈతకోట సుబ్బారావు మాట్లాడుతూ పఠాభి కవితాలోకానికి కారణ జన్ముడని అన్నారు. శాంతినికేతన, కొలంబియా విశ్వవిద్యాలయాల్లో చదివినా తమను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితమంతా కృషి చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఒక సాహిత్యరంగంలోనే కాకుండా సినిమా, పత్రికా రంగాల్లో కూడా విశేష కనపరిచిన మహోన్నతమైన పండితుడని ఈతకోట వివరించారు. అనంతరం చలంచర్ల భాస్కర్‌రెడ్డి ఉపన్యాసకులను సత్కరించారు.