వృత్తిని నిందిస్తే ఉరి తీయాలి

ఐలయ్యకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలకు మా మద్దతు ఉండదు: టీజీ వెంకటేశ్‌

కంచ ఐలయ్య సామాజిక ఉగ్రవాదిఐఎస్‌ కంటే ప్రమాదకారి: టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా దేశాన్ని, వృత్తిని, మతాన్ని నిందిస్తే నడిరోడ్డుపై ఉరితీయాలని అంతర్జాతీయ ఆర్య వైశ్య సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు. కంచ ఐలయ్య ఇతర దేశాల గురించి మాట్లాడుతుంటారని, ఆ దేశాల్లో లాగే చట్టాన్ని మార్చి నడిరోడ్డుపై ఉరి తీస్తే ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగవని అన్నారు. సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు పేరుతో కంచ ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.ఆర్యవైశ్యులనేది కులం కాదని, తెగ అని, నాగరికత మెదలైనప్పుడు చేసే పనిని బట్టి తెగ, కులాలు వచ్చాయని చెప్పారు. తాము వ్యాపారం చేసినందున వైశ్యులమయ్యామన్నారు. అనాది కాలం నుంచీ మత మార్పిడి.. అన్ని కులాలు, తెగల్లో జరిగినా వైశ్యుల్లో జరగలేదన్నారు. గ్రామాల్లో వైశ్యులు అప్పులు ఇచ్చినన్ని రోజులూ రైతుల ఆత్మహత్యలు జరగలేదని, బ్యాంకులు వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయని టీజీ వెంకటేశ్‌ పేర్కొన్నారు.కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మజ్లిస్‌ నాయకుడు ఇలాగే మాట్లాడితే ప్రతి కోర్టులోనూ కేసు పెట్టి.. ప్రతి పట్టణానికీ తిప్పారని, అలాంటి కేసులు ఐలయ్యపైనా పెట్టాలని టీజీ అన్నారు.

‘‘ఇతర దేశాలవారు మాల్స్‌ పెడితే ఐలయ్యకు బాధ కలగదు. ఈ దేశంలోనే పుట్టిన, అనాదిగా ఉంటున్న మేము వ్యాపారాలు చేస్తే మాత్రం బాధ కలుగుతుంది. ఈయనకు ఎవరు ఫండ్‌ ఇస్తే వారిగురించి మంచిగా మాట్లాడతారు’’ అని టీజీ ఆరోపించారు. కంచ ఐలయ్యకు మద్దతు ఇచ్చే పార్టీలకు ఆర్య వైశ్యులు మద్దతు ఇవ్వబోరని ప్రకటించారు. ఆయన పుస్తకాన్ని దక్షిణ భారత దేశం మొత్తం నిషేధించాలని కర్ణాటక ఆర్యవైశ్య సంఘం ప్రతినిధి అనిల్‌ గుప్తా అన్నారు. కాగా, కంచ ఐలయ్య సామాజిక ఉగ్రవాదిలా తయారవుతున్నారని, ఆయన పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ఐఎస్‌ ఉగ్రవాదుల కన్నా ఐలయ్య ప్రమాదకరంగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.