చిక్కడపల్లి, జూలై18(ఆంధ్రజ్యోతి): ఉద్ధండ పండితుడు, తెలంగాణ బిడ్డ కప్పగంతుల లక్ష్మణశాస్త్రి అని వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ సాహితీవేత్త కప్పగంతుల లక్ష్మణశాస్త్రి జయంతిసభ గురువారం రాత్రి గానసభలో జరిగింది. ఈ సందర్బంగా సమావేశంలో రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్‌ బుద్ధా మురళి, ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు రమణ వెలమకన్ని, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి తదితరులు పాల్గొని ప్రసంగించారు. సంభాషణాచతురుడు, హాస్యప్రియుడు అయిన శాస్త్రి తెలుగు పండితునిగా సుదీర్ఘకాలం పనిచేశారని అన్నారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, తమిళం, మరాఠీ, ఆంగ్లం, హిందీ, కన్నడ భాషల్లో పండితకోవిదుడన్నారు. ఆయన సాహితీలోకానికి ఎనలేని సేవ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రీయ సంగీత గాయని సంయుక్త, లక్ష్మి పాల్గొన్నారు.