చిక్కడపల్లి, మే 20(ఆంధ్రజ్యోతి): ఉన్నతమైన భావాలతో రచనలు చేస్తున్న డాక్టర్‌ ఎం.కె.రాము అభినందనీయుడని వక్తలు పేర్కొన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ, లిటిల్‌ మ్యుజీషియన్స్‌ అకాడమీ సంయుక్తాధ్వర్యంలో సోమవారం రాత్రి త్యాగరాయ గానసభలో ప్రముఖ కవి డాక్టర్‌ ఎం.కె.రాముకు భావకవితా చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ పూర్వ శాసనమండలి చైర్మన్‌ డాక్టర్‌ ఎ.చక్రపాణి, సినీ సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు, న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌.వేణుగోపాలాచారి, జస్టిస్‌ చంద్రకుమార్‌ హాజరై ప్రసంగించారు. తనలోని ఉదాత్త లక్షణాలను, భావాలను కవితల్లో చూపిస్తూ రాము చేస్తున్న రచనలు గొప్పగా ఉంటాయన్నారు. సమాజానికి ఏది అవసరం, ఎలాంటి విలువలను పాదుకొల్పాలి, విలువలను ఎలా పరిరక్షించాలి అనే అంశాలపై తన కవితల ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్న రాము గొప్ప కవి అన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో డాక్టర్‌ పాలకుర్తి మధుసూదనరావు, డాక్టర్‌ తిరుమల శ్రీనివాసాచార్య, నిర్వాహకులు నరసింహారావు, రామాచారి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్‌ రాము రచించిన లలిత గీతాల ఆలాపన ఆకట్టుకుంది.