17-12-2017: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ గేయ రచయితహైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న శుభవేళ ఇది. స్వాభిమానం పెంచే ఈ సభల సమయంలో మరో ముఖ్యమైన చింతనాశీలుర వేదికలో పాల్గొనేందుకు ప్రస్తుతం గోవాలో ఉన్నా. ఇక్కడ భారతీయ భావజాలాన్ని ప్రసారం చేసే ఇండియా ఫౌండేషన్‌ వారు, స్వరాజ్‌ పత్రిక కలసి నాలుగేళ్ళుగా ప్రతి ఏటా జరుపుతున్న 3 రోజుల ఇండియా ఐడియా కాన్‌క్లేవ్‌లో పాల్గొంటున్నా.వివిధ రంగాల మేధావులను దగ్గరకు చేర్చి, వారి భావాలను పంచుకొనే వేదిక ఇది. ఇందులో సేవా రంగం, సాంకేతిక రంగం, వైద్య రంగం, సాహిత్య.. సాంస్కృతిక రంగాల నుంచి నలుగురు ప్రసిద్ధులకు అవార్డులు ఇస్తారు. మన సాహిత్యం, సంస్కృతికి చేసిన కృషిని గుర్తించి, ఈ ఏడాది నాకీ అవార్డు ప్రదానం చేస్తున్నారు. ఈ సభలు అయ్యీ కాగానే, భాగ్యనగరం చేరి, తెలుగు మహాసభల్లో భాగమవుతున్నా.పరిపాలన రంగంలోనే కాక, భాష, సంస్కృతికి సంబంధించి కూడా చురుగ్గా పనిచేస్తూ, మంచి పేరు తెచ్చుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. చాలామంది పాలకులకు భిన్నంగా ఆయన చూపే భాషా, సాహిత్యాభిమానానికి ఈ మహాసభలు మరో ఉదాహరణ. 

తొలిరోజు సభలు భారీస్థాయిలో మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.నాలుగో రోజున పాట... జీవితంపై జరిగే సాహిత్యసభలో గౌరవ అతిథిగా పాల్గొంటున్నా. నన్నడిగితే మనిషితో పాటే పాట పుట్టింది. ఆ మాటకొస్తే గానం చేసేది గేయం గనక, ఆదికవి వాల్మీకి రాసిన రామాయణం కూడా పాటే! అలాంటి పాట కాలగతిలో ఎలా మారుతూ వచ్చింది, ఇప్పుడెలా ఉంది, ఇంకెలా ఉండాలి లాంటి అంశాలన్నీ ఆ సభలో మాట్లాడుకొనే అవకాశం వస్తుందనుకుంటున్నా.ఇలాంటి సభల ఉపయోగమేమిటని ఎవరో అడిగారు. జీవితం యాంత్రికమైనప్పుడు పండుగలు కావాలి. అప్పుడు మళ్ళీ కొత్త ఉత్సాహం వస్తుంది. ఈ భాషా ఉత్సవాలు కూడా అలాంటి పండుగలే. ఇవి స్వీయస్థితిని గుర్తు చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తాయి. భాష, సంస్కృతి గురించి మళ్ళీ మనలోనే ఒక స్పృహ కలిగించడానికీ కచ్చితంగా ఉపకరిస్తాయి. పైగా, ఇవాళ తెలుగు అక్కర్లేదు... ఇంగ్లీషు మీడియమ్‌ చాలని మంత్రుల స్థాయి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు.