పలువురు కవులు, రచయితలకు దన్ను
‘నెలనెలా వెన్నెల’ పేరుతో 40 ఏళ్లు కృషి

హైదరాబాద్‌ సిటీ ఆగస్టు12 (ఆంధ్రజ్యోతి): ‘నెలనెలా వెన్నెల’ పేరుతో వర్ధమాన, యువ కవులను ప్రోత్సహించిన సాహితీ ప్రేమికుడు, కవి, రచయిత చింతలపాటి వెంకట కృష్ణారావు (94) ఇకలేరు. వయోభారంతో ఆయన ఆదివారం రాత్రి 9 గంటలకు చైతన్యపురిలోని తన ఇంట్లో అంతిమశ్వాస విడిచారు. కృష్ణారావుకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. 40 ఏళ్లుగా కాకినాడ, హైదరాబాద్‌ వేదికలుగా ప్రతినెలా చివరి ఆదివారం ఆయన నిర్వహించిన ‘నెల నెలా వెన్నెల’ కార్యక్రమం ద్వారా సినీగేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, ప్రభుత్వాధికారి వాడ్రేవు చినవీరభద్రుడు, అఫ్సర్‌, కుప్పిలి పద్మ వంటి కవులెందరో స్ఫూర్తి పొందారు. 

అక్కడ చదివిన కవితలతో ‘నెలనెలా వెన్నెల’ పేరుతోనే ఐదు కవితా సంపుటాలకు సంపాదకులుగా వ్యవహరించారు. కృష్ణారావు 1926 జూలై 3న కృష్ణాజిల్లా జగయ్యపేట తాలూకాలో పుట్టారు. 1943లో ఉస్మానియా యూనివర్సిటీ టెక్నికల్‌ కాలేజీలో డిప్లొమా కోర్సులో చేరారు. ఆయనకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతోనూ సంబంధాలున్నాయి. అనంతరం గుంటూరు హిందూ కాలేజీలో బీకాం పూర్తి చేశారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధాజ్ఞలు కొనసాగిన కాలంతో జైలు శిక్షనూ అనుభవించారు.