చిక్కడపల్లి, హైదరాబాద్, జూలై17(ఆంధ్రజ్యోతి): పద్యనాటకాలు అందరినీ ఆకట్టుకుంటాయని ప్రముఖ కవి డా. ఎంకే రాము అన్నారు. కల్పన కళానికేతన్‌ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యాగరాయగానసభలో డా. సి. నారాయణరెడ్డికి అంకితంగా సకల కళల పద్య నాటక సమాహార సప్తాహం కార్యక్రమం జరిగింది. డా. ఎంకే రాము ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కురుక్షేత్రం పద్యనాటకం శయన ఘట్టంలో నటించిన దొంతి జంగయ్యగౌడ్‌, దయాకర్‌, సూర్యప్రకా్‌ష్‌లను సన్మానించి మాట్లాడుతూ పద్యనాటకాలు ఆనాటినుంచి ఈనాటి వరకు కూడా ప్రజల ఆదరణకు నోచుకుంటున్నాయన్నారు. పద్యనాటకాలు ప్రదర్శిస్తున్నారంటేనే వాటిని ఆదరించే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారన్నారు. పద్యనాటకాలను ప్రదర్శించి మన సంస్కృతి, సంప్రదాయాలను ఈ తరానికి తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో వైఎ్‌సఆర్‌ మూర్తి ట్రస్ట్‌ అధ్యక్షుడు వైఎ్‌సఆర్‌ మూర్తి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, శంకరం వేదిక అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, వాస్తు పండితుడు ఆచార్య హనుమంతరాయశర్మ, మిమిక్రీ కళాకారులు మల్లెల సుధాకర్‌, రత్నాకరశర్మ తదితరులు పాల్గొన్నారు.