రవీంద్రభారతి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): మాదల వీరభద్రరావు గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. ఆదివారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక సమితి, సాధన సాహితీ స్రవంతి, సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్‌ పాత్రికేయుడు మాదల వీరభద్రరావు శతజయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు ఎంవీఆర్‌.శాస్త్రికి మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య ఎంవీఆర్‌.శాస్త్రిని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మాదల వీరభద్రరావు శతజయంతి ప్రత్యేక సంచిక స్మరణీయం-తెలుగు, మై స్టోరీ(నాకథ) పుస్తకాల ఆవిష్కరణ చేశారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ తన చిన్నతనంలో వీరభద్రరావుతో అనుబంధమేర్పడిందని, ఆయన ఈ తరానికి ఆదర్శమూర్తి అని అన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తి, సాహితీవేత్త ఒలేటి పార్వతీశం, ఆధ్యాత్మికవేత్త రఘునాథశర్మ, దైవజ్ఞశర్మ, సాధన సాహితీ సమితి అధ్యక్షుడు నరసింహాచార్య తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.