రవీంద్రభారతి, హైదరాబాద్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): సున్నితమైన సుగుణాల సౌందర్యరాశి గజల్స్‌ అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. గురువారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో ప్రముఖ కవి కోరుప్రోలు మాధవరావు రచించిన తెలుగు గజల్‌ సంపుటి మాధవ మందారాలు-2 పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిడి హరికృష్ణ పుస్తకాన్ని ఆవిష్కరించి రచయితను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజల్స్‌ ఉర్దూ భాషలో నుంచి పుట్టినప్పటికీ తెలుగు భాషలోనుంచే పుట్టినట్లుగా ఈ పుస్తకంలో కనిపిస్తోందన్నారు. సినారె గజల్స్‌ తెలుగు ప్రేక్షకులను అలరించాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నేటినిజం సంపాదకుడు బైస దేవదాస్‌ సభాధ్యక్షత వహించగా ముకుంద సుబ్రహ్మణ్యశర్మ, సాహితీవేత్త సంగనభట్ల నరసయ్య, ఇరువింటి వెంకటేశ్వరశర్మ, తమ్మూరి రామ్మోహన్‌రావు, తాళ్లపల్లి మురళీధర్‌గౌడ్‌, ఎన్వీ రఘువీర్‌ ప్రతాప్‌ తదితరులు పాల్గొని కవి మాధవరావు దంపతులను ఘనంగా సత్కరించారు.