కవాడిగూడ, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): పదకవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల 611వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఉదయం ట్యాంక్‌బండ్‌పై అన్నమాచార్య భావనావాహిని ఆధ్వర్యంలో మహానగర సంకీర్తన భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో అన్నమాచార్య భావనావాహిని వ్యవస్థాపకురాలు పద్మశ్రీ శోభరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభరాజు శిష్యబృందంతో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ చిక్కడపల్లి, సుధాహోటల్‌లేన్‌, త్యాగరాయగానసభ, సిటీ సెంట్రల్‌ లైబ్రరీ, అశోక్‌నగర్‌, ఇందిరాపార్కు చౌరస్తా, రామకృష్ణమఠం, కట్టమైసమ్మ దేవాలయం మీదుగా అన్నమయ్య విగ్రహం వరకు చేరుకున్నారు. అన్నమాచార్య భావన వాహిని విద్యార్థి సాందీప్‌ వెంకటేశ్వరస్వామి వేషధారణలో, పవన్‌చరణ్‌ అన్నమాచార్య వేషధారణలో మహానగర సంకీర్తనలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ అన్నమయ్య విగ్రహం వద్ద పద్మశ్రీ శోభరాజు శిష్యులతో పాటు ఆలపించిన అన్నమయ్య సంకీర్తలు, భక్తిగీతాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంఖ్యాశాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ, అన్నమాచార్య భావన వాహిని మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ నందకుమార్‌, గాయత్రి నారాయణ్‌ తోపాటు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.