అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి(చెన్నై), చందూర్ కుటుంబం, స్నేహితుల సంయుక్త ఆధ్వర్యంలో ‘శ్రీమతి మాలతీ చందూర్ పురస్కార ప్రధానోత్సవం’ జరుగనుంది. ఆగస్టు 25న శనివారం సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నందమూరి తారకరామారావు కళామండపంలో జరగనున్న ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి, తెలంగాణ సాంస్కృతిక మీడియా వ్యవహారాల సలహాదారు కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవికి మాలతీ చందూర్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య ఎస్‌వీ సత్యనారాయణ, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు యార్లగడ్డ  లక్ష్మీ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు ఆచార్య ముదిగంటి సుజితారెడ్డి, ప్రముఖ రచయిత, సినీ గేయకర్త భువనచంద్ర.. తదితరులు ఈ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొననున్నారు. 

రచయిత్రిగా మాలతీ చందూర్ తెలుగునాట సుప్రసిద్ధులు. చంపకం- చెదపురుగులు, శతాబ్ది సూరీడు, కాంచన మృగం, మనసులో మనసు, ఏమిటీ జీవితాలు, మధుర స్మృతులు, శిశిర వసంతం, ఆలోచించు, భూమిపుత్రి వంటి 25కు పైగా నవలలను ఆమె రచించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జరిగిన ప్రసిద్ధ ‘చీరాల-పేరాల’ ఉద్యమ నేపథ్యంలో ఆమె రాసిన ‘హృదయనేత్రి’ నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆమె నవలలు అనేకం తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదం అయ్యాయి. 
 
కొన్ని ప్రసిద్ధ తమిళ, ఆంగ్ల రచనలను మాలతీ చందూర్ తెలుగులోకి అనువదించారు. కథా రచయిత్రిగా దాదాపు 150కి పైగా కథలను ఆమె రాశారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు పాఠకుల ప్రశ్నలు- జవాబుల ‘ప్రమదావనం’ శీర్షికను విజయవంతంగా నడిపారు. తెలుగు కాలమిస్ట్‌ల చరిత్రలో అరుదైన ఘనత ఇది. ఓ ప్రసిద్ధ మాసపత్రికలో 3 దశాబ్దాల పైచిలుకు ప్రతి నెలా ‘పాత కెరటాలు’ శీర్షికన ప్రపంచ ప్రసిద్ధ ఆంగ్ళ రచనలకు ఆమె చేసిన పరిచయం మోస్ట్ పాపులర్. రచయిత్రిగా ఆమె కృషిని గుర్తించి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆమె పేరున ఏర్పాటు చేసిన ‘శ్రీమతి మాలతీ చందూర్ పురస్కారా’న్ని 2018వ సంవత్సారానికి గానూ ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవికి ప్రదానం చేయనున్నారు.
 
తెలంగాణలో అత్యధిక నవలలు రాసిన రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి. స్త్రీల జీవితాన్ని విస్తృతంగా చిత్రించిన మాదిరెడ్డి సులోచన, ముదిగంటి సుజితారెడ్డి తదితరుల కోవలో ఆమెది ఓ ప్రత్యేక స్థానం. వనపర్తి సంస్థానంలో పేష్కారుగా పనిచేసిన సూగూరు హనుమంతరావు, సీతమ్మ దంపతులకు 1942 జూలై 15న వనపర్తి తాలూకా శ్రీరంగాపురంలో శాంతాదేవి జన్మించారు. బడిలో చదువుకుంది తక్కువ.. జీవితంలో, సమాజంలో ఆమె చదివింది ఎక్కువ. కేవలం మెట్రిక్యులేషన్ వరకే చదువుకుని పాఠకులను కట్టిపడేసేలా 64 నవలలు, 80 దాకా కథలను రాయడం శాంతాదేవికే దక్కిన అరుదైన సాహితీ రికార్డు. ఆమె రాసిన కొన్ని కథలు కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లోకి అనువాదమయ్యాయి. ‘చండీప్రియ’ నవల సినిమాగా, ‘పుష్యమి’ నవల ‘ఆత్మబంధువు’ పేర టీవీ సీరియల్‌గా తెరకెక్కాయి. ఆమె రచనలపై ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాయాల్లో పరిశోధనలు జరిగాయి. ఆమె సాహితీ కృషికి గుర్తింపుగా పలు సంస్థల నుంచి సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంలో 2015వ సంవత్సరంలో సాహితీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ప్రస్తుతం మాలతీ చందూర్ పురస్కారానికి ఎంపికయ్యారు.