సివిల్‌ ఇంజనీర్‌. నెలకు లక్షరూపాయల జీతం. అదేదీ వద్దనుకున్నారు.  వదిలేశారు... పై ఫొటోలో కనిపిస్తున్న వెంకటేశ్వరరావు. ఇప్పుడాయన  జీవిత లక్ష్యం... సంగీతం నేర్పడం. ఫీజు రూపాయి. సంగీతం నేర్పుతూ .. ఎక్కడ రాత్రి అయిపో తుందో అక్కడే నిద్ర...! నమ్మశక్యం కాని నిజం ఇది...

హైదరాబాద్, బంజారాహిల్స్‌:సంగీతంలోని ఆనందాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేస్తున్నారు..సంగీతోద్యమకారుడు  ఎస్‌ వెంకటేశ్వరరావు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎస్‌వీ రావు సివిల్‌ ఇంజనీర్‌, అనేక పెద్ద కంపెనీల్లో పనిచేశారు. నెలకు  లక్ష రూపాయల జీతం వరకు తీసుకున్నారు. అయితే ఎక్కడో తెలియని వెలితి. సంగీతం అంటే ఇష్టపడే ఆయన ఓ సారి ఫ్లూట్‌తో సరిగమలు పలికించారు. ఇది నేర్చుకోవడానికి ఆయనకు రెండు నెలలు పట్టింది. కానీ ఫ్లూట్‌లో రాగాలు పలికించాక ఆయన ఆనందానికి అవధుల్లేవు. అంతే ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరికీ పంచాలని భావించారు. చేస్తున్న ఉద్యోగం వదిలేశారు. ఫ్లూట్‌లు, గిటారు, కీ బోర్డును పట్టుకొని నగరానికి చేరి అందరికీ సంగీత శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తక్కువ సమయంలో ఫ్లూట్‌, కీబోర్డు, గిటార్‌ ను ఎలా నేర్చుకోవాలో చెబుతున్నారు.  భుజానికి ఫ్లూట్‌ల బ్యాగు,.. గిటారు, ఒక జత దుస్తులు, మరో చేతిలో కీ బోర్డుతో ఎస్‌ వీ రావు ఎప్పుడు పర్యటిస్తూనే ఉంటారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు, జలగం వెంగళరావు పార్కులో ఉదయం, సాయంత్రం రవీంద్రభారతి, నెక్లెస్‌ రోడ్డులో తిరుగుతుంటారు. సంగీతం నేర్పిస్తానంటూ తానంతట తానే పరిచయంచేసుకుంటాడు. శిక్షణ ఇచ్చినందుకు తన భోజన ఖర్చు కింద  రుపాయి మాత్రమే తీసుకుంటారు. వయసు, ధనిక, పేద భేదాలు అతడికి లేవు. ఉదయం మొలకెత్తిన గింజలు, మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ భోజనం, రాత్రి ఎక్కడ స్థలం దొరికితేఅక్కడ నిద్రిస్తూ సంగీత సేవ చేస్తున్నారు.