హేమమాలిని ఆత్మకథకు ప్రధాని నరేంద్ర మోదీ ముందు మాట రాశారు. ‘స్టార్‌డస్ట్‌’ పత్రిక మాజీ సంపాదకుడు, రచయిత రామ్‌కమల్‌ ముఖర్జీ రచించిన హేమమాలిని అధికారిక జీవిత కథ ‘బియాండ్‌ ద డ్రీమ్‌ గాళ్‌’ పుస్తకాన్ని ఈ నెల 16న ఆవిష్కరిస్తున్నారు. ఆ రోజు హేమ జన్మదినం. అంతే కాదు, ఈ ఏడాదితో నటిగా ఆమె కెరీర్‌కు 50 ఏళ్లు! ‘రామ్‌కమల్‌ ముఖర్జీ రాసిన నా ఆత్మకథ ‘బియాండ్‌ ద డ్రీమ్‌ గాళ్‌’ ఫస్ట్‌లుక్‌. ఇది విక్కీ ఇద్నానీ తీసిన ఫొటో. హార్పర్‌ కాలిన్స్‌ వాళ్లు పుస్తకాన్ని ప్రచురిస్తున్నారు’’ అని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు హేమమాలిని. తన ముందు మాటను మోదీ చాలా క్లుప్తంగా, అందంగా రాశారని రామ్‌కమల్‌ తెలిపారు. ‘‘హేమాజీపై తన అభిప్రాయాల్ని చాలా క్లుప్తంగా ప్రధాని రాశారు. నాకు తెలిసి ఒక బాలీవుడ్‌ యాక్టర్‌పై ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ముందు మాట రాయడం ఇదే ప్రథమమనుకుంటా. రచయితగా నాకూ, యాక్టర్‌గా హేమాజీకి ఇదొక గౌరవం’’ అని ఆయన చెప్పారు. 23 చాప్టర్లుగా హేమ జీవిత కథను ఆయన రాశారు. ఆమె బాల్యం, యవ్వనం, బాలీవుడ్‌, ‘డ్రీమ్‌గాళ్‌’గా ఉన్నత స్థానానికి ఎదగడం, ప్రేమ, సహనటులు, వివాహం, ఆమె రెండో ఇన్నింగ్స్‌, రాజకీయ ప్రయాణం, ఆధ్యాత్మిక జీవనం.. వంటి దశలన్నింటినీ ఆయన వివరించారు.