17-05-2018, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్‌ జాతీయ సాహిత్య అవార్డును ఈ ఏడాది తెలుగు, సంస్కృత భాషా పండితుడు, ద్రవిడ యూనివర్సిటీ పూర్వ వీసీ రవ్వా శ్రీహరికి అందజేయనున్నట్లు ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్టు ప్రకటించింది. అవార్డు కింద రూ.లక్ష నగదు, బంగారు పతకం, ఎన్టీఆర్‌ జ్ఞాపికతోపాటు సత్కారం ఉంటుందని తెలిపింది. బుధవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, ట్రస్టు సలహాదారు కేవీ రమణాచారి, ట్రస్టు చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి మాట్లాడారు. 2007 నుంచి నేటి వరకు ఏటా సాహిత్య రంగంలో ఉద్దండులైన వారికి ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్టు ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిఘంటువులు రాయగల ప్రావీణ్యం, ద్రవిడ యూనివర్సిటీ పూర్వ వీసీగా సాహిత్యసేవ చేసిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ రవ్వ శ్రీహరిని జ్యూరీ కమిటీ సభ్యులు ఈ అవార్డుకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈ అవార్డును ఎన్టీఆర్‌ జయంతి రోజైన ఈనెల 28న రవీంద్రభారతిలో ప్రదానం చేస్తామన్నారు.