అద్భుత కవిత్వం వస్తున్నా ..కొత్త పాఠకులను సృష్టించడం లేదు: నగ్నముని

కవాడిగూడ, జూలై 17 (ఆంధ్రజ్యోతి) :ప్రస్తుత కాలంలో అద్భుత కవిత్వం వస్తున్నా కొత్త పాఠకులను సృష్టించడం లేదని ప్రముఖ కవి నగ్నముని అన్నారు. ఇందిరాపార్కు చౌరస్తాలోని హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో మంగళవారం సాయంత్రం రచయిత మోహన్‌ రుషి రచించిన స్క్వేర్‌ వన్‌ పుస్తకాన్ని నగ్నముని ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. కవి యాకుబ్‌ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమలో ఆత్మీయ అతిథులుగా కవి, గాయకుడు గోరటి వెంకన్న, సిద్ధార్థ, దెంచనాల శ్రీనివాస్‌ హాజరయ్యారు. వక్తలుగా ప్రముఖ కవి, విమర్శకులు అంబటి సురేంద్రరాజు. పెన్నా శివరామకృష్ణ, వాసు విఽశ్వనాథుల , విశిష్ట అతిథిగా దీవి సుబ్బారావు పుస్తకాన్ని సమీక్షించారు. అనంతరం నగ్నముని మాట్లాడుతూ, రచయిత మోహన్‌రుషి కవిత్వం అంతరంగంలోని మనోవేదనను తెలియజేస్తోందన్నారు.కవి విమర్శలను ఆహ్వానించాలన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని రచయితను అభినందించారు.