రవీంద్రభారతి, హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి): గోన బుద్ధారెడ్డి తొలి రాజకవి అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ‘కావ్యపరిమళం’ శీర్షికన గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం పుస్తకంపై ప్రముఖ సాహితీవేత్త కసిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ రంగనాథ రామాయణం తెలంగాణ జానపదుల హృదయాలకు దగ్గరగా ఉందన్నారు. తెలంగాణలో పౌరాణిక గేయాలలో కూడా రామాయణానికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయన్నారు. గోన బుద్ధారెడ్డి స్వయానా పాలకుడు కావడంతో ప్రజల హృదాయాలకు చేరే రామాయణాన్ని రచించారన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలతో ఇక్కడి రాజులు మమేకమై ఉన్నారని పేర్కొన్నారు. ప్రసంగకర్త కసిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సామాన్య జనానికి అర్థమయ్యే భాషలో రంగనాథ రామాయణం రచించారని తెలిపారు. ముమ్మాటికీ రంగనాథ రామాయణం రచించింది గోన బుద్ధారెడ్డి అని పరిశోధనల్లో తెలిందని తెలిపారు. వాల్మీకి రామాయణంలో లేని అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. రాముడి గుణగణాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేశారన్నారు. ఈ సభకు సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలోపలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.