హైదరాబాద్, చిక్కడపల్లి: నాటకరంగం నుంచి అఖిల భారత సంగీత నృత్య పోటీలవరకు సాంస్కృతిక, కళారంగాలకు నవ్యనాటక సమితి ఆరు దశాబ్దాలుగా చేస్తున్న కృషి అపూర్వమైందని పలువు రు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం చిక్కడపల్లిలోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సంస్థ సభ్యుల వార్షిక సమావేశం లో ప్రముఖ సంగీత విద్వాంసుడు పద్మశ్రీ డా. మహా భాష్యం చిత్తరంజన్‌ మాట్లాడుతూ 1958 సంవత్సరం నుంచి నాటకాలు, నాటికలు, సంగీత, నృత్యనాటికలు వంటి వివిధ ప్రక్రియలలో విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమితి తన ప్రత్యేకతను చాటుకుందన్నారు. నవ్యనాటకసమితి వ్యవ స్థాపకుడు వేమరాజు నరసింహారావు చిరస్మరణీయులని అన్నమయ్యమిషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ కామిశెట్టి శ్రీనివాసులు, ప్రముఖ కవి డా. జె బాపురెడ్డి కొనియాడారు. ఈ సమావేశాలకు ప్రముఖ నర్తకీమణులు, నాట్యగురువులు ఎన్‌ సుధామాల, సజని వల్లభనేని, సంగీత విద్వాంసురాలు శ్రీదేవి, స్వర్ణలతా చంద్రశేఖరన్‌, వల్లూరి శ్రీమణి హాజరయ్యారు. త్వరలో 47వ జాతీయస్థాయి సంగీత నృత్యపోటీలను నిర్వహిస్తున్నట్టు నవ్యనాటక సమితి అధ్యక్షుడు వేమరాజు విజయకుమార్‌ తెలిపారు. అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసులు డా. ఎంచిత్తరంజన్‌ను పారిశ్రామికవేత్త, ప్రముఖ సంఘసేవకురాలు సీతాశేషగిరిరావు సంస్థ పక్షాన సత్కరించారు.