16-12-2017: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, కవి... రచయితతెలుగు మృతభాష అయిపోతుందా అని ఆందోళన రేగుతున్న సమయంలో భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం భాషా, సాహిత్య ప్రేమికులందరికీ సంతోషమే. కానీ, ఈ సభలు జరుగుతున్న తీరు, ఇందులో ఎవరిని ఎందుకు ఆహ్వానించారు, ఎందుకు ఆహ్వానించలేదన్న చర్చ మాత్రం విషాదకరమైన వాస్తవం. నా విషయానికే వస్తే... ఎందుకనో కానీ, నన్ను ఈ తెలుగు భాష పండుగకు ప్రభుత్వం పిలవనేలేదు. 20 ఏళ్ళుగా ఇక్కడే నివసిస్తున్నా. నా ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. మొన్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా రయ్యిమని దూసుకుపోయిన గుర్తుకే ఓటూ వేశాను.బతుకమ్మ, సింగరేణి, రామప్ప... కనపడలేదా?ఇప్పటికి తెలుగులో 20 శతకాలు రాశా. కృష్ణానదీశతకం రాసి పుష్కరాల్లో కృష్ణమ్మకు అర్పించా. కోనసీమ శతకం రాసి వాయుదేవుడికి అంకితమిచ్చా. ఉత్తరాంధ్ర శతకం రాసి అగ్నికి అర్పించా. 

వచ్చే నెల 2న అవనిగడ్డలో చాగంటి వారి చేతుల మీదుగా దివిసీమ శతకం ఆవిష్కరణ జరుగుతోంది. వీటన్నిటి కన్నా ముందే, ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డానికి చాలాకాలం ముందే తెలుగులో ఎవరూ రాయని విధంగా బతుకమ్మ శతకము (2011), సింగరేణి శతకము (2012), రామప్ప శతకము (2013) అంటూ 3 శతకాలు తెలంగాణ భాష, జీవితం, సంస్కృతి మీదే రాశాను.అయితే, ఇవేవీ నన్ను ఈ మహాసభలకు ఆహ్వానించడానికి సరిపోయినట్లు లేవు! నన్ను పిలవాలనో, ఎవరి మనసులో గెలవాలనో నేను ఇవి రాయలేదు. నాకు ఆ అవసరమూ లేదు. కవిగా నా హృదయ స్పందనను తెలియజేయడానికి చేసిన రచనలవి. కానీ, వాటిని వేటినీ పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు.ఈ ప్రయోగాలు పనికిరావా?నా సినిమా గీత రచన పావు వంతు అయితే, మిగతా సాహిత్యం ముప్పావు వంతు.

సంస్కృత భాషలో డిస్కో గీతం, సరిగమపదని అనే సప్తస్వరాలైన ఏడు అక్షరాలతోనే పాట, పద్యం, ఇంగ్లీషు మాటలతో తెలుగు దండకం ఇలా ఎన్నెన్నో ప్రయోగాలు. తెలుగులో దండకాలు, గేయాలు, శతకాలు, నన్నయ నుంచి నేటి దాకా ప్రముఖులందరి రచనల పేరడీలు, సినిమా పాటలు... ఇన్ని ప్రక్రియల్లో ప్రయోగాలు చేసిన జొన్నవిత్తుల లాంటి కవి ఎంతో అరుదని తెలంగాణ, ఆంధ్ర కవి పండితులు, పెద్దలు అన్నారు. తెలుగు భాషలోని 56 అక్షరాలనూ సరస్వతీదేవి శరీరభాగాలు, అలంకారాలుగా వర్ణిస్తూ చాలా ఏళ్ళ క్రితమే పాట రాశా.