రవీంద్రభారతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సమాజ హితానికి కవి సమ్మేళనాలు ఉపయోగపడాలని వక్తలు అన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. ఇందులో సుమారు 120మంది కవులు తమ కవితలను వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే కవితలు రావాలన్నారు. కవిసమ్మేళనం, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, ప్రకృతి, సాహిత్యంతో అనుసంధానమైనవని పేర్కొన్నారు. ప్రముఖ కవి ఎన్‌.గోపి మాట్లాడుతూ ప్రకృతికి ఉగాదికి ఉన్న సంబంధాన్ని తన కవిత్వం ద్వారా వినిపించారు. 

భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టెర్‌ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలుగు కవిత్వంలో మాధుర్యం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా 120 మంది కవులతో కవిసమ్మేళనం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం జరిగిన కవిసమ్మేళనంలో ప్రముఖ కవులు అమ్మంగి వేణుగోపాలరావు, తిరుమల శ్రీనివాసాచార్యలతో పాటు పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు. ఇందులో భాగంగా కవయిత్రుల కవితాపఠనం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.