పొన్నూరు, 22-05-2019: ప్రముఖ కవి, తెలుగు పండిట్‌ బొద్దులూరి నారాయణరావు మంగళవారం మృతి చెందారు. మండలంలోని వల్లభరావుపాలెం గ్రామానికి చెందిన నారాయణరావు 1925లో జన్మించారు. గ్రామంలో వ్యవసాయం చేస్తూనే విద్యనభ్యసించిన ఆయన హిందీ రాష్ట్ర భాషా ప్రచారక్‌ చదివి ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో బంగారు పతకాన్ని సాధించారు. పొన్నూరు పట్టణంలోని సాక్షి భవనారాయణస్వామి సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చదివి గోల్డ్‌మెడల్‌ పొందారు. కొంతకాలం హిందీ పండిట్‌గా, మూడు దశాబ్దాలు తెలుగు పండిట్‌గా వివిధ పాఠశాలల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.
 
నారాయణరావు శాంతిపథం, రాధేయుడు, కవిత కాదంబిని, పాంచజన్యం వంటి ఎన్నో పద్య కావ్యాలను రాశారు. నారాయణరావు రచించిన శాంతిపథం పుస్తకం భాషా ప్రవీణ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించారు. నారాయణరావు పద్య రచనల్లో ప్రతిభను గుర్తించిన రాష్ట్రంలోని పలు సంస్థలు, సాహిత్య పీఠాలు పలు పురస్కారాలను ప్రదా నం చేశాయి. నారాయణరావు మృతి సమాచారం తెలుసుకుని పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ నారాయణరావు మృతికి సంతాపం తెలిపారు. బుధవారం వల్లభరావుపాలెంలో నారాయణరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.