దశాబ్దాల తర్వాత వేదికైన హైదరాబాద్‌

డిసెంబరు 15 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహణ

19-10-2017 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మర సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి మహాసభలు కావడంతో ప్రభుత్వం ఈ సభలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో 1975లో జరిగిన మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభల(డబ్ల్యూటీసీ)కు హైదరాబాద్‌ వేదికవగా, నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ అవకాశం దక్కింది. రెండో మహాసభలు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో 1982లో, మూడో మహాసభలు 1990లో మారిషస్‌ వేదికగా జరిగాయి. తిరుపతిలో నాలుగో తెలుగు మహాసభలను 2012లో నిర్వహించారు. తాజాగా ఈ ఏడాది డిసెంబర్‌ 15వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియం వేదికగా ఐదో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ సభలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రూ.50 కోట్లు మంజూరు చేశారు. రవీంద్ర భారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కళాశాల మైదానం, భారతీయ విద్యాభవన్‌, పింగళి వెంకట్రాంరెడ్డి హాల్‌, శిల్పా కళావేదికల్లో కూడా కార్యక్రమాలు జరిగే అవకాశముంది.