(అమరావతి, విశాఖపట్నం, విజయవాడ - ఆంధ్రజ్యోతి): తేట తెలుగు... తేనెలొలుకు! దేశ భాషలందు తెలుగులెస్స! మా తెలుగు తల్లికి... మల్లెపూదండ! తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది! అనుకోడానికి... పాడుకోవడానికి... చెప్పుకోడానికి బాగానే ఉంది! మరి... మన పాఠాల్లో ఉన్న ‘తెలుగు’ ఎంత? దాని వెలుగు ఎంత? భాషాభిమానులందరినీ కలవరపెడుతున్న ప్రశ్న ఇది! ఎందుకంటే... ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో తెలుగు మాయమవుతోంది! ‘మార్కులకు పనికిరాని’ సబ్జెక్టుగా మిగిలిపోతోంది. తెలుగు స్థానంలో పరభాషా వ్యామోహపు తెగులు వ్యాపిస్తోంది. తమిళనాడులో సెంట్రల్‌ సిలబ్‌సలోనూ తొమ్మిదవ తరగతి వరకు తమిళం తప్పనిసరిగా బోధించాల్సిందే. ఇక... సోదర తెలుగు రాష్ట్రం తెలంగాణలో పాఠశాల నుంచి జూనియర్‌ కళాశాల వరకు ప్రతిచోటా తెలుగు ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. సిలబస్‌ ఏదైనా... ఒక బోధనాంశంగా తెలుగు ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. మరి... ఆంధ్రప్రదేశ్‌లో ఏమిటి పరిస్థితి?

 ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో బోధన పూర్తిగా మాతృభాషలోనే జరుగుతుంది. ఇంజనీరింగ్‌, వైద్యశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు కూడా వారి మాతృభాషలోనే లభ్యమవుతాయి. అక్కడ అవసరం మేరకే ఆంగ్లం నేర్చుకుంటారు. మనకు మాత్రం ‘ఇంగ్లిష్‌’ మోజు పట్టుకుంది. ఇదిపెరిగి... తెలుగు పట్ల నిర్లక్ష్యంగా మారుతోంది. మరో అడుగు ముందుకుపడి... జర్మన్‌, ఫ్రెంచ్‌, జపనీస్‌, చైనీస్‌ వంటి విదేశీ భాషలపై ప్రేమ పుడుతోంది. అదేమిటని ప్రశ్నిస్తే... ‘కాంపిటీటివ్‌ వరల్డ్‌లో కంపల్సరీ’ అనే సమాధానమే వస్తోంది!
 
పాఠశాల స్థాయి నుంచే...
పాఠశాల స్థాయిలో రాష్ట్ర, సీబీఎ్‌సఈ సిలబ్‌సలు ఉంటాయి. రాష్ట్ర సిలబస్‌ చదివే విద్యార్థులు ప్రథమ భాషగా తెలుగు చదవాల్సిందే. ద్వితీయ భాషగా హిందీ, తృతీయ భాషగా ఆంగ్లం తీసుకుంటున్నారు. ప్రథమ భాషలోనూ ఒక మెలిక ఉంది. ఇందులో 80 శాతం తెలుగు, మిగిలిన ఇరవై శాతం సంస్కృతం చదవాలి. ద్వితీయ, తృతీయ భాషలుగా ఎంపిక చేసుకునే హిందీ, ఆంగ్లం మాత్రం నూటికి నూరుశాతం అదే భాషలో చదవాలి. ఒకవేళ ప్రథమ భాషగా హిందీని ఎంపిక చేసుకుంటే... ద్వితీయ భాషగా తెలుగు, తృతీయ భాషగా ఆంగ్లం తీసుకోవాలి. ద్వితీయ భాష ఏదైనా నూరుశాతం చదవాల్సిందే. వెరసి... రాష్ట్ర సిలబస్‌ వరకు తెలుగుకు ఢోకా లేనట్లే. అసలు సమస్య సెంట్రల్‌ సిలబ్‌సతోనే! ప్లేస్కూల్‌ పేరిట మూడో ఏడు దాటగానే బడిలో వేస్తున్నారు.
 
వారికి... మొదలు పెట్టడమే ఏ ఫర్‌ యాపిల్‌! ‘అ-అమ్మ, ఆ-ఆవు’ అని తెలుగు అక్షరాలు నేర్పించరు. కొన్ని స్కూళ్లలో ఐదో తరగతి దాకా తెలుగు చెప్పనే చెప్పరు. తర్వాత ఆరో తరగతిలో మొక్కుబడిగా నేర్పించడం మొదలుపెడతారు. సీబీఎ్‌సఈ సిలబస్‌ విద్యార్థులు ప్రథమ భాషగా ఆంగ్లం, ద్వితీయ భాషగా హిందీ తీసుకోవాలి. తెలుగుకు మూడోస్థానం ఇచ్చారు. అదికూడా 6, 7, 8 తరగతుల్లో చదివితే చాలు. 9, 10లో తెలుగు ఆప్షనల్‌ మాత్రమే! అంటే... ఇష్టముంటేనే తీసుకోవచ్చు.
 
ఇంటర్‌లో కనుమరుగే...
ఇంటర్‌ స్థాయిలో తెలుగు పరిస్థితి దయనీయం, దారుణం! కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ భాషగా ఆంగ్లం, ద్వితీయ భాషగా సంస్కృతం మాత్రమే బోధిస్తారు. కాగడా వేసుకుని వెతికినా... తెలుగు కనిపించదు. ఎందుకని అడిగితే... ‘సంస్కృతం స్కోరింగ్‌ సబ్జెక్ట్‌’ అంటూ ఒక సమర్థన. సంస్కృతంలో అక్షరం ముక్క రాకపోయినా, పరీక్షను సంస్కృతంలో రాయకపోయినా 95 శాతం మార్కులు ఇట్టే సాధించవచ్చు. మరికొందరు వందకు వంద కొట్టేస్తారు. వారికి సంస్కృతమూ రాదు! తెలుగూ రాదు! మార్కులు మాత్రం వస్తాయి. సంస్కృత జవాబు పత్రాల మూల్యాంకనాన్ని సరళంగా ఉంచి... పరోక్షంగా ప్రభుత్వమే తెలుగును చంపేస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, సంక్షేమ జూనియర్‌ కళాశాలల్లో మాత్రం రెండో భాషగా తెలుగు అందుబాటులో ఉంటుంది. కనీసం 20 మంది ఉంటే హిందీ బోధిస్తున్నారు.
 
త్రిభాషా సూత్రం అమలు కాగితాలకే పరిమితమవుతోంది. ‘‘ఎలిమెంటరీ స్థాయిలో పూర్తిగా మాతృభాషలోనే బోధన ఉండేలా చూస్తాం. ఆంగ్లం ఒక సబ్జెక్టుగా మాత్రమే ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో మాత్రం తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలను సమాంతరంగా నిర్వహిస్తాం’’ అని టీడీపీ గత ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. ఇప్పుడు అది అమలు కావడం లేదు. మునిసిపల్‌ స్కూళ్లలో ఎలిమెంటరీ స్థాయిలో మాతృభాషలో బోధన చేయడం లేదు. తాజాగా సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌ -1 పరీక్షల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం ప్రశ్నపత్రమే ఇచ్చారు. అంటే.. తెలుగు కథ ముగిసినట్లే!
 
మాధ్యమం ఎప్పుడో మాయం
చిన్న పల్లెటూరు నుంచి పెద్ద నగరందాకా... ప్రైవేటు స్కూళ్లన్నీ ఇప్పుడు ఇంగ్లీషు మీడియమే! ప్రైవేటు బడుల్లో బోధనా మాధ్యమంగా తెలుగు ఎప్పుడో మాయమైపోయింది. ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఇది మిగిలి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ప్రైవేటు, కార్పొరేట్‌ బడుల్లోని ‘ఇంగ్లీషు’ మోజే దీనికి కారణం. ప్రైవేటు స్కూళ్లను తెలుగు బాట పట్టించాల్సిన ప్రభుత్వం... తానే ఆంగ్ల మాయలో పడుతోంది. మునిసిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియంను తగలేస్తూ... ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతోంది.
 
అదే గొప్పగా మారింది!
‘‘తెలుగుకు బదులు హిందీ, సంస్కృతం, జర్మన్‌, ఫ్రెంచ్‌, జపనీస్‌, చైనీస్‌ భాషలను ప్రత్యామ్నాయ సబ్జెక్టులుగా చేశారు. తల్లిదండ్రులు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారు. తమ పిల్లలకు తెలుగు రాకపోవడాన్ని కూడా వారు గర్వంగా చెప్పుకొంటున్నారు’’

- విజయవాడకు చెందిన ఒక ఉపాధ్యాయుడు

అమ్మ భాషతో ఆకళింపు
ఇటీవల ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయం ఆంగ్లం, తెలుగు మాధ్యమ విద్యార్థులపై అధ్యయనం చేసింది. దీని ప్రకారం ఆంగ్లంలో చదువుతున్న వారికంటే మాతృభాషలో చదివే విద్యార్థులకు గణితం, పరిసరాల విజ్ఞానంతోపాటు ఆంగ్లంలో పట్టు ఎక్కువగా ఉందని తేలింది.
 
మాతృ భాషలోనే మాట్లాడండి
మనం ఇప్పుడు తల్లిని ఇంగ్లిష్‌లో మమ్మీ అని పిలుస్తున్నాం. కానీ మమ్మీ అన్న పిలుపు పెదవులమీదనుంచే వస్తుంది. అదే అమ్మ అనో అమ్మి( ఉర్దూ) అనో పిలిస్తే అది హృదయంలోనుంచి వస్తుంది. మాతృభాషను ఎవరూ మరిచిపోవద్దు.
-ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు