రాముడు లంక నుండి తిరిగి వచ్చే సమయంలో సముద్ర తీరంలో ఈశ్వరుణ్ణి ప్రార్థించాడని ఒక కథ ఉంది. ఆ స్థలాన్నే ఇపుడు మనం రామేశ్వరం అంటున్నాం. ‘రామచంద్రేణ సమర్చితం తం రామేశ్వరాఖ్యం సతతం నమామి’ అని రామేశ్వరుడి ప్రస్తావన ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రంలో ఉంది. రామేశ్వరుడు అనే పదంపై ఒక ఆసక్తికరమైన వివాదం ఉంది. వ్యాకరణం ప్రకారం ఈ పదానికి రెండు అర్థాలు చెప్పవచ్చు. రామునికి ఈశ్వరుడైన (దేవుడైన) వాడు అని ఒక అర్థం, రాముడు ఎవరికి ఈశ్వరుడో (దేవుడో) అతడు అని మరొక అర్థం. రాముడు పూజించాడు కాబట్టి మా ఈశ్వరుడే గొప్ప అని ఒక వర్గం. అలా కాదు, రాముడు ఎవరికి దేవుడో అతడు అని అర్థం కాబట్టి రాముడే గొప్ప అని మరొక వర్గం వాదించుకున్నారట.

 
దీనిపై రామభక్తులు వెళ్లి ఆ కౌసల్యాతనయుడినే అడిగారట. అప్పుడు రాముడు వారితో.. తత్పురుష సమాసం ప్రకారం రాముడికి దేవుడైనవాడు అనే అర్థాన్ని చెప్పాడట. శివుని భక్తులు వెళ్లి ఆ హరుణ్ని అడగ్గా..‘బహువ్రీహి సమాసం ప్రకారం రాముడు ఎవరికి దేవుడో అతడు’ అని చెప్పాడట. ఇద్దరూ వినయశీలురే. తమను తాము గొప్పగా చెప్పుకోలేదు. ఇద్దరిలో భేదం లేదని వారికి తెలుసు.
భక్తులకు ఏమి తోచక ఋషుల్ని అడిగారట. ఋషులు రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అంటూ కర్మధారయ సమాసంలో అర్థం చెప్పారట. ఈ వివాదాన్నంతటినీ ఒక చిన్న శ్లోకంలో ఇలా చెప్పారు.
 
‘రామః తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః
రామేశ్వర పద ప్రాప్తే ఋషయః కర్మధారయమ్‌’

శివుడు వేరు, విష్ణువు వేరు, లలితాదేవి వేరు, దుర్గాదేవి వేరు అనే భావాలు లోకంలో సహజం. కానీ, ఇవన్నీ ఒకే తత్త్వంలోని వివిధ అంశాలు, వివిధ రూపాలని ఉపనిషత్తుల సందేశం అని రుషులు వివరించారు.

-కె.అరవిందరావు