విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశీలన జరిగిన తొలి తెలుగు గజల్ కవిగా రోచిష్మాన్ అరుదైన గుర్తింపును అందుకున్నారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టా కోసం రోచిష్మాన్ గజళ్లపై మానం సునీత ఈ పరిశోధన చేశారు. తెలుగులో ఒక కవి గజళ్లపై ఇలాంటి పరిశోధన జరగడం ఇదే తొలిసారి కాగా రోచిష్మాన్ ఇంగ్లిష్ గజళ్లు పలు అంతర్జాతీయ సంకలనాలలో చోటుచేసుకున్నాయి. తమిళ భాషలో కూడా గజళ్లు వ్రాసిన రెండో వ్యక్తిగా రోచిష్మాన్ ఘనతను సాధించారు
 
తన గజళ్లను పరిశీలనకు ఎంపిక చేసిన మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సంపత్ కుమార్ మాడభూషికి రోచిష్మాన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పరిశీలన చేసిన మానం సునీతను అభినందించారు. పెద్ద చదువులు చదువుకోని, కనీసం పట్టభద్రుడిని కూడా కాని తనకు లభించిన అరుదైన సత్కారంగా దీనిని తాను భావిస్తున్నానన్నారు. తనకు దక్కిన ఈ ఘనత అంతా సుప్రసిద్ధ కవి, గాయకులైన కీర్తిశేషులు పి.బి. శ్రీనివాస్ తనకు పెట్టిన భిక్ష అని రోచిష్మాన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన దివ్య ఆత్మకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తుంటానన్నారు.