అకాడమీ సెక్రటరీ శ్రీనివాసరావు

24మందికి అవార్డులు ప్రదానం

విజయవాడ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాహిత్య అకాడమీని ఏర్పాటు చేయాలని అకాడమీ సెక్రటరీ శ్రీనివాసరావు అన్నారు. గతంలో కూడా ఈ విషయమై చాలాసార్లు కోరానని తెలిపారు. బాలల సాహిత్యంపై వస్తున్న కథనాలు, మార్పులపై సాహితీవేత్తల, రచయితల సమావేశం విజయవాడలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ హాల్లో బుధవారం జరిగింది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజున పలువురు బాలల సాహిత్య రచయితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల సాహిత్యానికి కూడా ప్రాముఖ్యం ఇవ్వాలని, మాతృభాషలో చదువు దూరమవుతున్న నేపథ్యంలో బాల సాహిత్యం ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు(మంగళవారం) 24 రాష్ట్రాలకు చెందిన 24 భాషల వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందించారు. చిన్నపిల్లల సాహిత్యం విభాగంలో అవార్డు అందుకున్న వాసాల నరసయ్య మాట్లాడుతూ పిల్లలందరూ ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్స్‌తో ఆడుకుంటూ సంప్రదాయాన్ని, మాతృభాషను మరచిపోతున్నారని, పుస్తకాల బరువును తగ్గించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. నేటి పిల్లలు నేషనల్‌ జియోగ్రాఫిక్‌, డిస్కవరీ, వార్తలు వంటివి చూడటం మానేసి, వీడియో గేమ్స్‌, సినిమాలు అంటూ వెళ్లిపోతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.