కరీంనగర్‌ కల్చరల్‌/న్యూఢిల్లీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): బాలసాహిత్యంలో విశిష్ట సేవలకుగాను రచయిత, కవి వాసాల నరసయ్యకు ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన కవయిత్రి మెర్సీ మార్గరెట్‌కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఆమె రచించిన ‘‘మాటల మడుగు’’ కవిత్వానికి ఈ అవార్డు లభించింది. తెలుగు సహా 24 భాషల్లో యువ పురస్కారాలను ప్రకటించగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఆమె ఒక్కరే ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం 2017 సంవత్సరానికిగాను బాల సాహిత్య, యువ పురస్కారాలను సాహిత్య అకాడమీ ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన జాబితాను సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ విశ్వనాథ్‌ ప్రసాద్‌ తివారి నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఆమోదించింది.

నవంబరు 14న బాలల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో వాసాల నరసయ్య, మెర్సీ మార్గరెట్‌ ఈ అవార్డులను అందుకోనున్నారు. కాగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మెట్‌పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో జన్మించిన నరసయ్య ఎనిమిదో తరగతి నుంచి సాహిత్యంపై అభిరుచి పెంచుకున్నారు. స్కూల్‌ దశలోనే అభ్యుదయవాణి అనే బాలసాహిత్య పత్రికను సొంతగా వెలువరించారు. ఆయన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పోస్ట్‌మాస్టర్‌గా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. 1978లో ‘కర్షకుడా.. కార్మికుడా’ పేరుతో తొలి గేయ సంపుటిని వెలువరించారు.

ఆ తర్వాత తన కలాన్ని పూర్తిగా బాలసాహిత్యానికి కేటాయించారు. కథ, వ్యాసం, పొడుపుకథలు, గేయాల రూపంలో సుమారు 28 బాలసాహిత్య పుస్తకాలను రచించారు. మరో 8 వచన కవితా సంపుటిలను వెలువరించారు. ఆయన రచనల్లో తపాల ఈడీ ఉద్యోగులు, చిరు తరగలు, ఈదేశం, తపాలా చార్జీలు, గమ్యం, సమాజానికి సంకెళ్లు ఆదరణ పొందాయి. తెలుగు రాష్ట్రాల్లోని బాలసాహితీవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో 2009 నుంచి వాసాల నరసయ్య బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.