ఆంధ్రజ్యోతి,హైదరాబాద్‌ సిటీ: సంగీతం...మనస్సులోని కల్లోలానికి విరుగుడు. సంగీతం...బాధలను మరిపించే మందు. సంగీతం... జవసత్వాలను ఉత్తేజపరిచే వ్యాయామం. ఒక్క మాటలో చెప్పాలంటే సంగీతం దివ్యౌషధం. నేడు వరల్డ్‌ మ్యూజిక్‌ డే. ఈ సందర్భంగా సంగీతం మనిషికి ఎలాంటి సాంత్వన కలిగిస్తుంది. భారతీయ సంగీతానికున్న గొప్పతనం ఏంటి? భాగ్యనగర సంగీత ప్రముఖుల అభిప్రాయాలతో అంతర్జాతీయ సంగీతదినోత్సవ కథనం. 

ఈ ప్రపంచంలో సంగీతాన్ని ఆస్వాదించలేని వారు ఎవరన్నా ఉన్నారంటే వారు తోక, కొమ్ములు లేని జంతువులతో సమానం అంటారు షేక్‌స్పియర్‌. మనిషి మాటతోపాటూ పాటనూ నేర్చుకున్నాడు. ఆ పాట కాలంతో పాటూ రకరకాలుగా రూపాంతరం చెందింది. సంగీతంలో రకరకాల ప్రక్రియలు పురుడుపోసుకున్నాయి. ఏ దేశ సంగీతానికైనా ’’స రి గ మ ప ద ని‘‘ ఈ సప్త స్వరాలే మూలం. ఇవే ఆధారం. వినసొంపైన ప్రతి సంగీతం ఆమోదయోగ్యమే. మనిషి జీవితంలో ఓ అంతర్భాగం సంగీతం. పండితులు, పామరులు ఎవరికి తోచిన విధంగా వారు సంగీతాన్ని తమదైన శైలిలో మలుచుకున్నారు. 
 బహు చక్కని భారతీయ సంగీతం

ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఓ ప్రత్యేక స్థానం. ఇక్కడ 12వ శతాబ్దంలో జయదేవుడు అష్టపదుల ద్వారా సంగీతాన్ని పునరుజ్జీవింపచేశారంటారు. ఆ తర్వాత అన్నమయ్య, నారాయణ తీర్థులు, క్షేత్రయ్య, రామదాసు, త్యాగరాజు వీరంతా వారి కాలాల్లో భారతీయ సంగీత స్థాయిని పెంచారు. వారి కాలాల్లోనే భారతీయ సంగీతం కొత్త పుంతలు తొక్కింది. 14వ శతాబ్ధంలో పర్షియన్ల రాకతో భారతీయ సంగీతంలో పర్షియన్‌ల సంగీతం మిళితమైంది. హిందుస్థానీ పుట్టింది. కర్ణాటిక సంగీతం, హిందుస్థానీ వంటి శాస్త్రీయ సంగీతంతో పాటు, గజల్స్‌, ఖవ్వాలీ, లైట్‌ మ్యూజిక్‌(లలిత సంగీతం), జానపదం వంటి రకరకాల విభిన్న సరళులతో భారతీయ సంగీతం అలరారుతోంది.  గతంతో పోల్చుకుంటే నేడు మన నగరంలో శాస్త్రీయ సంగీతం నేర్చుకునే వారి సంఖ్య పెరిగిందంటున్నారు సంగీత కళాకారులు. గతంలో కేవలం సంగీతాన్ని వృత్తిగా తీసుకొని బతకడం కష్టంగా ఉండేది. టెలివిజన్‌ రియాల్డీషోలు, పాటల పోటీ కార్యక్రమాలతోపాటు సినీ నేపథ్యగానం, వాటితో పాటు కచేరీలు వంటి అవకాశాలు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగానే ఉన్నాయి.  

  యువత మక్కువ వీటిపైనే

 ఈ మధ్యకాలంలో పాప్‌, రాక్‌బ్యాండ్‌, బ్రాస్‌బ్యాండ్‌, ఫ్యూజిన్‌, ఇండిపాప్‌ వంటివి బాగా యువతను ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో సైతం పాటలను శాస్త్రీయ సంగీత స్వరాల నేపథ్యంలో వచ్చేవి. వాటిల్లో ఎక్కువగా మెలోడీ పాటలను ప్రజలు ఆదరించేవారు. ఆయితే నేడు మాత్రం ఎక్కువగా ఫాస్ట్‌బీట్‌ పాటలనే యువత ఇష్టపడుతోంది. అందుకే సినిమాల్లో సైతం ఫాస్ట్‌బీట్‌లే ఎక్కువగా వస్తున్నాయి.  శాస్త్రీయ సంగీతం, మానసిక ఆరోగ్యాన్ని అందిస్తుందని హెల్సింకీ యూనివర్సిటీ వారి పరిశోధనలలో సైతం  తేలింది. ఆటిజం చిన్నారులకు, కేన్సర్‌ చికిత్స పొందుతున్న వారికి మ్యూజిక్‌ థెరపీ మంచి ఉపశమనం కలిగిస్తుందని బ్రిటీష్‌ జనరల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ సంస్థ అధ్యయనాలు చెబుతున్నాయి. 

 నగరంలోని ప్రభుత్వ సంగీత కళాశాలలు
శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య 
      కళాశాల, కింగ్‌కోఠి
 
శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య 
      కళాశాల, హైకోర్డు రోడ్డు, పేట్ల బురుజు
 
శ్రీ భర్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య 
      కళాశాల, వెస్ట్‌ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్‌
 
పొట్టి శ్రీరాములు తెలుసు యూనివర్సిటీ
 
హైదరాబాద్ నగరం సంగీతం...
గజల్స్‌, ఖవ్వాలి, డోలాకే గీత్‌ సంగీత ప్రక్రియలకు హైదరాబాద్‌ ప్రసిద్ధి. ఉర్దూ గజల్స్‌ను  మొట్టమొదట రాసిన వారు భాగ్యనగర నిర్మాత మహ్మద్‌ కులీకుతుబ్‌షా అన్న సంగతి చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
 
పట్యాలా ఘరానా రూపకర్త, ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు ‘‘ఉస్తాద్‌ బడే గులామలీఖాన్‌’’ లాహోర్‌లో జన్మించారు. దేశంలోనే గొప్ప సంగీత విద్వాంసుడుగా పేరుపొందిన ఆయన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. బడేగులామలీఖాన్‌ స్మాకరంగా బషీర్‌బాగ్‌లోని ఓ రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. అంతేకాదు ఆయన సమాధి పాతబస్తీలోని ‘‘దాయెరా మీర్‌ మోమిన్‌’’ దర్గా ప్రాంగణంలో ఉంది.
 
ఖవ్వాలి కేవలం పురుషులు మాత్రమే నిర్వహిస్తారు. అయితే ఆ సంప్రదాయాన్ని తోసిరాజి పాతబస్తీలోని బాలికలు, మహిళల సమస్యలపై వ్యతిరేకంగా పనిచేస్తున్న షాహీన్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు జమీలా నిషాథ్‌ ఆధ్వర్యంలో కొంత మంది యవతులు ఈ ప్రదర్శనలు ఇస్తున్నారు.
 
శాస్త్రీయ సంగీతారాధన పెరిగింది
  ‘‘మేం పుట్టి పెరిగిందంతా పాతబస్తీలోని యాకుత్‌పురాలో. మా అమ్మ, నాన్న  సంగీత పండితులు. అమ్మ త్యాగరాయ శిష్యపరంపర వారసులు. నాన్న తంజావూరు సంప్రదాయం వారసులు. మేం ఊహెరిగిన నాటి నుంచే సంగీత శిక్షణ ప్రారంభించాం. మేం కచేరీ ఇస్తున్న తొలినాళ్లలో, శాస్త్రీయ సంగీతమని హేళన చేసేవారు. తమిళనాడులోని త్యాగరాయస్వామి సమాధి వద్ద అన్నదమ్ములిద్దం కలిసి కచేరీ ఇచ్చాం. ఆ కార్యక్రమం మాకు గుర్తింపు తెచ్చింది. 1978-80 సమయంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఇద్దరం కలిసి కచేరీ ఇచ్చాం. ఆ కార్యక్రమానికి హాజరైన ఐఏఎస్‌ అధికారి కిషన్‌రావు గారు మమ్మల్ని ‘‘హైదారాబాద్‌ బ్రదర్స్‌’’ అని సంబోధించారు. నాటి నుంచి ఆ పేరుతోనే సంగీత సేవను కొనసాగిస్తున్నాం.  గతంతో పోలిస్తే ప్రస్తుతం శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కొంచెం పెరిగిందని చెప్పవచ్చు.   
-రాఘవాచారి, శేషాచారి, హైదరాబాద్‌ బ్రదర్స్‌  శాస్త్రీయ సంగీత విద్వాంసులు
 
లలితసంగీతం ఇప్పుడొక ప్రత్యేక రంగంగా మారింది
లలిత సంగీతం ఇప్పుడు ఒక ప్రత్యేక రంగంగా ఏర్పడింది. చాలా మంది లలిత సంగీతం నేర్చుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. కారణం నేడు సినిమా, టెలివిజన్‌, స్టేజ్‌ ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు పెరగడం. ఎంతో మందికి ఉపాధి కలిగించే రంగంగా లలిత సంగీతం ఉంది. 1998 నుంచి లిటిల్‌ మ్యూజీషియన్‌ అకాడమీ సంస్థ ద్వారా ఎంతో మంది చిన్నారులకు లలిత సంగీతంలో శిక్షణ ఇచ్చాం. సినీరంగంతోపాటు ఇండియన్‌ ఐడియల్‌గా పేరుపొందిన కారుణ్య, హేమచంద్ర, రోహిత్‌ కూడా మా వద్ద సంగీత శిక్షణ తీసుకున్నవారే. బాలీవుడ్‌లో పాడుతున్న నా శిష్యుడు ఇర్ఫాన్‌ మన హైదరాబాదీ.
-రామాచారి, నిర్వాహకులు, 
లిటిల్‌ మ్యూజీషియన్‌ అకాడమీ
 
 సమాజ హితాన్ని కోరే సంగీతం
అన్నమయ్య, రామదాసు, త్యాగరాయస్వామి వారంతా  దైవభక్తితోపాటు ప్రజల సమస్యలనూ సాహిత్య వస్తువుగా తీసుకొని, సంగీత ప్రతిసృష్టి చేశారు. సంగీతం అంతిమ లక్ష్యం సమాజ హితమనేది జగద్విదితమే. ఆ స్ఫూర్తితో సుబ్రహ్మణ్య భారతి రాసిన ‘‘విడుదలై..విడుదలై’’, రవీంద్రుడు రచించిన ‘‘ఏక్‌లే ఛలోరే’’, మహాత్మా గాంఽధీకి సైతం అమితమైన గుజరాతీ గీతం ‘‘వైష్ణవ జనతో’’, శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కొన్ని కవితలు...వాటన్నింటినీ కర్ణాటక సంగీతంలో స్వరపరిచాను. నిర్భయ సంఘటన నేపథ్యంలో ‘‘ఓ భారత మహిళ! నీకింత సహనమేలా?’’, ‘‘స్త్రీ విముక్తి పయనం’’, విద్య ప్రాముఖ్యాన్ని తెలిపే ‘‘మా బడి వైభవం’’, సంగీతం వైశిష్ట్యాన్ని వివరించే ‘‘సంస్కృతి’’ వంటి నృత్యరూపకాలకు సాహిత్య రచనతోపాటు, సంగీత దర్శకత్వం వహించాను. శ్రీ కోదండపాణి సంగీత విద్యా సంస్థ ద్వారా విద్యార్థులకు సంగీత శిక్షణ ఇస్తున్నాం.  బస్తీ పిల్లలకు ఉచితంగా సంగీతం నేర్పిస్తున్నాం. 
-సంగీత కళ, కర్ణాటక సంగీత కళాకారిణి