హైదరాబాద్: కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’లో చిన్న పిల్లాడి పాత్రలో కనిపించారు తులసి. తర్వాత కథానాయికగా, ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. శంకరం పాత్రతో తనను తెలుగుతెరకు పరిచయం చేసిన గురువు, ఇటీవల దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్న కె.విశ్వనాథ్‌కి గురుదక్షిణగా ‘శంకరాభరణం’ పేరుతో ఓ అవార్డును ప్రారంభించి పురస్కారాలను ప్రదానం చెయ్యబోతున్నారు. ఈ నెల 20న హైదరాబాద్‌ శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరగనుంది. తులసి మాట్లాడుతూ ‘‘తెలుగు పరిశ్రమలో ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులతో దక్షిణాదికి చెందిన ఇతర కళాకారులకు కూడా ‘శంకరాభరణం’ పురస్కారాల్ని అందించబోతున్నాం. తెలుగు సినీ ప్రముఖులతోపాటు తమిళ, మలయాళ సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమలో పాల్గొంటారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాను. ఇది నా గురువుకు దక్షిణగా భావిస్తున్నాను. ఎన్టీఆర్‌, కొరటాల శివ. ధనుశ్‌, దుల్కర్‌సల్మాన్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు’’ అని అన్నారు.