చిక్కడపల్లి, మే 20(ఆంధ్రజ్యోతి): ప్రోత్సహించేవారు, వీక్షించేవారు ఉంటే హరికథా కళా ప్రక్రియ శోభాయమానంగా వెలుగొందుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి అన్నారు. అంతరించిపోతున్న కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. త్యాగరాయ గానసభ ఆధ్వర్యాన గానసభలో సోమవారం రాత్రి ‘భక్త మార్కండేయ చరిత్ర’ హరికథను భాగవతార్‌ జె.జయరాములు చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయనను సన్మానించిన సిధారెడ్డి మాట్లాడుతూ సంస్కారాన్ని పెంచే దిశగా హరికథ వంటి కళారూపాలు పనిచేస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తరగతినుంచి పదో తరగతి వరకు తప్పకుండా తెలుగు చదువుకునే విధంగా చట్టం చేసిందని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా దీని అమలుకోసం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, డాక్టర్‌ కేవీ రావు, తిరుమాణి చంద్రశేఖర్‌, శ్రీరామ్‌ పాల్గొన్నారు.